హస్తిన హస్తాల్లో
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను చేతుల్లోకి తీసుకున్న అధిష్టానం
స్థానికంగా మకాం వేసి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్న ఏఐసీసీ పెద్దలు
తెలంగాణ సీనియర్ల తీరుపై అసహనం.. నామమాత్రంగా పొన్నాల
పసునూరు మధు
పేరుకే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఇక పెత్తనమంతా ఢిల్లీ పెద్దలదే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, ఎన్నికల వ్యవహారాన్ని అధిష్టానం పెద్దలు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఏఐసీసీకి చెందిన ఏడుగురు ప్రముఖులు ప్రస్తుతం తెలంగాణలోనే పూర్తిగా మకాం వేసి ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉంది? అధిగమించేందుకు ఏం చేయాలి? అభ్యర్థుల ప్రచార సరళి ఎలా ఉంది? తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు వారికి అప్పగించిన బాధ్యతలను ఏ విధంగా నెరవేరుస్తున్నారు? ఇలాంటి అంశాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో అభ్యర్థుల గెలుపుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలను సమాయత్తపరుస్తున్నారు. పోలింగ్‌కు మరో మూడు రోజులే వ్యవధి ఉండటంతో పోల్ మేనేజ్‌మెంట్ దిశగా పావులు కదుపుతున్నారు. నియెజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న పోలింగ్ స్టేషన్ల వివరాలు తెప్పించుకుని అక్కడ స్థానికంగా పట్టున్న నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని అభ్యర్థులకు వివరిస్తూ అవసరమైతే ఆర్థిక వనరులను కూడా సమకూర్చే పనిలో పడ్డారు.
ఏడుగురూ హేమాహేమీలే
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నా కాంగ్రెస్‌కు పూర్తిస్థాయిలో ఓట్లు రాలే పరిస్థితి లేకపోవడంతో అధిష్టానం పెద్దలంతా ఇప్పుడు తెలంగాణపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటికే ప్రధానమం త్రి మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీ ఒక్కోసారి, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండుసార్లు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివావారం సోనియాగాంధీ మరోమారు తెలంగాణలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ప్రచారానికి సిద్దమయ్యారు. అయినప్పటికీ కాంగ్రెస్ మెజారిటీ సాధించే పరిస్థితి కన్పించకపోవడం, అదే సమయంలో టీఆర్‌ఎస్ దూసుకుపోతుండటంతో పునరాలోచనలో పడిన సోనియా, రాహుల్... రాష్ట్ర వ్యవహారాలతో సంబంధమున్న ఏఐసీసీ నేతలందరినీ రంగంలోకి దించారు. కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు పక్షం రోజులుగా తెలంగాణలోనే మకాం వేయడం తెలి సిందే. దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ ఆజాద్, వయలార్ రవి, కేబీ కృష్ణమూర్తి కూడా రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. రోజూ వీరంతా సమావేశమై ఏయే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, కాంగ్రెస్ గెలుపు కోసం అభ్యర్థులు, నాయకులు ఏం చేస్తున్నారంటూ సమీక్షిస్తున్నారు.
పొన్నాల నామమాత్రమే
ఏ రాష్ట్రంలోనైనా పీసీసీ అధ్యక్షుడి పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంటుంది. ముఖ్యమంత్రి, ప్రభుత్వం లేనిచోట్లలోనైతే ఆయన నిర్ణయాలే శిరోధార్యాలవుతాయి. కానీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి తొలి అధ్యక్షుడిగా నియమితుడైన పొన్నాల లక్ష్మయ్య పాత్ర ఎన్నికల్లో నామమాత్రంగా మారింది. అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు మొదలుకుని ఆర్థిక వనరుల వినియోగం దాకా అంతా అధిష్టానమే పర్యవేక్షిస్తోంది.
ఆర్థిక వ్యవహారాలు ఆంధ్రా నేత చేతికి!
టికెట్ల ఎంపికలో తన మాట చెల్లుబాటు కాకపోవడం తో ఆర్థిక వనరుల విషయంలో పెద్దలతో పొన్నాల అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దాంతో కాం గ్రెస్ అధిష్టానం టీపీసీసీ ద్వారా నిధుల వినియోగం, ఇతరత్రా అవసరాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ సీమాంధ్రకు చెందిన పీసీసీ మాజీ చీఫ్ చేతిలో పెట్టింది. ఇక సీఎం ఆశావహులైన పలువురు కాంగ్రెస్ సీనియర్లను కూడా నియోజకవర్గాలకే పరిమితం చేసింది అధిష్టానం. ఒక్కొక్కరికీ మూడు సెగ్మెంట్ల బాధ్యతలు అప్పగించింది. అక్కడి అభ్యర్థుల గెలుపును పూర్తిగా వారి చేతుల్లోనే పెట్టింది!