సాక్షి, హైదరాబాద్: దళితుడే తొలి సీఎం అన్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన మాటకు కట్టుబడకపోతే తెలంగాణలో అంతర్యుద్ధం మొదలవుతుందని, ఆయన కుటుంబం హైదరాబాద్‌లో ఉండదని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మాది గలు, మాల ల్లో ఎవరికి సీఎం పదవిచ్చినా అభ్యం తరం లేదన్నారు. ఒకవేళ దళితుల మీద నమ్మకం లేకపోతే బీసీలకైనా అవకాశమివ్వాలన్నారు. జర్నలిస్టు సంఘాలు టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే శనివారం ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మందకృష్ణతో మీట్ ది మీడియా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. బీసీలకు కేసీఆర్ న్యాయం చేయలేదని విమర్శించారు. తెలంగాణలో దొరల ఆధిపత్యాన్ని, అహంకారాన్ని చెల్లనివ్వమన్నారు. ఆయన తెలంగాణ కోసం అమరణ దీక్ష చేసినప్పుడు తాను పక్కనే ఉన్నానని, నిమ్మరసం ఇచ్చేటప్పుడు నా చేయిని ముద్దాడి కనీటి పర్యంతమయ్యారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మాట మీద నిలిచే వ్యక్తి కాదని, తన కుటుంబం కోసమే పార్టీని స్థాపించారని ధ్వజమెత్తారు.
దొరల బిడ్డ కాబట్టే కవిత జైలుకెళ్లకుండా అర్ధరాత్రి బెయిల్ తెచ్చుకున్నారని, అదే ఉద్యమకారిణి విమలక్క మూడు నెలలు జైలులో ఉన్నా కేసీఆర్ ఒక్కనాడూ మాట్లాడలేదని విమర్శించారు. ‘నేను నటుణ్ని కాదు. ఉద్యమం నుంచి వచ్చాను. నా దగ్గర వంద కోట్లు లేవు. ప్రజలకే సంపాదించి పెట్టానే తప్ప వారి నుంచి నేనేమీ పొందలేదు. వికలాంగుల సమక్షంలో పార్టీని ప్రకటించాను. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా ఏర్పడలేదు. కూటి కోసం రిక్షా తొక్కిన కుటుంబం నుంచి వచ్చాను. అలాంటి వ్యక్తి ఓ పార్టీని స్థాపంచే పరిస్థితి ఎందుకు వచ్చింది? పేదరికం, అంటరానితనాన్ని రూపుమాపేందుకు మా పార్టీ కృషి చేస్తుంది. మావోయిస్టులు, అంబేద్కర్ అజెండానే మా అజెండా’ అని మందకృష్ణ ఉద్వేగంగా మాట్లాడారు.
అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణను కోరుకుంటున్నా అసెంబ్లీలో మాత్రం తీర్మానం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే చట్టసభల్లో తమ గళం వినిపించేందుకే పార్టీని పెట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తానంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు... 2009 ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు ఇస్తామని ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఆయనకూడా మోసం చేశారని ఆరోపించారు. తాను పార్టీ పెడితే ఏమాత్రం ప్రాధాన్యమివ్వని మీడియా.. పవన్ కల్యాణ్ పార్టీ పెడితే మాత్రం పేజీలకు పేజీలకు రాశాయని పేర్కొన్నారు. తమ ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భవిష్యత్తులో మీడియాను పెట్టనున్నట్లు చెప్పారు.