ప్రధాని సభకు భారీ బందోబస్తు | manmohan singh tour huge security | Sakshi
Sakshi News home page

ప్రధాని సభకు భారీ బందోబస్తు

Published Sat, Apr 26 2014 3:38 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

manmohan singh tour huge security

భువనగిరి, న్యూస్‌లైన్ : భువనగిరి మండలం రాయిగిరి శివారులో శనివారం నిర్వహించే కాంగ్రెస్ సభకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ పాల్గొనే ఈ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ర్ట అదనపు డీజీ సదీప్‌లాక్టాకియా, ఇంటలిజెన్స్ సెక్యూరిటీస్ ఐజీ మహేష్ భగవత్‌ల అధ్వర్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే సభాస్థలిని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడంచెల బందోబస్తును ఏర్పా టు చేశారు. వేదిక సభాప్రాంగణం, హెలిప్యాడ్, వీఐపీ, వీడియో గ్యాలరీ, పార్కింగ్ స్థలాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
 ఇందుకోసం జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావుతో పాటు ఆరుగురు డీఎస్పీ లు, 24మంది సీఐలు, 23మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు స్పెషల్ పార్టీలు బాంబ్ డిస్పోజల్ టీమ్‌లు తమ విధులను నిర్వహించనున్నారు. పోలీస్ అధికారులకు, సిబ్బం దికి ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కాగా నాయకులకు వీఐపీ పాస్‌లు జారీ చేసినట్లు చెప్పారు. పాస్‌లు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు. నాలుగు గంటలకు సభ ఉన్నందున 3గంటలకే నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.
 
 సభా ప్రాంగణం సిద్ధం
 ప్రధాని సభ కోసం సభా ప్రాంగణాన్ని అధికారులు సిద్ధం చేశారు. సభా ప్రాంగణం, వేదిక, హెలిప్యాడ్‌లు సిద్ధమయ్యాయి. సభ ఏర్పాట్లను భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం గూడూరు నారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. 3లక్షల మంది హాజరయ్యే ఈ సభకు  ఏర్పాట్లు చేసినట్టు వారు తెలిపారు. ప్రధాని మన్మోహన్ సింగ్, రా్రష్ట వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్, కుంతియాతో పాటు పలువురు కాంగ్రెస్ ఉన్నతస్థాయి నాయకులు హాజరౌతారని చెప్పారు. ఏర్పాట్ల పరిశీలనలో మాజీమంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్, జహంగీర్, లాల్‌రాజ్‌లు పాల్గొన్నారు.
 
 ప్రధాని పర్యటన షెడ్యూల్
 ప్రధానిమంత్రి మన్‌మోహన్‌సింగ్ శని వారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 3.10గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి 3.15గంటలకు హెలిక్యాప్టర్‌లో బయలుదేరి భువనగిరి సమీపంలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ వద్దకు 3.45గంటలకు చేరుకుంటా రు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం పూర్తికాగానే తిరిగి ఐదు గంటలకు తిరుగు పయనమవుతారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement