పలకజీడిలో రీపోలింగ్.. భన్వర్ లాల్ ఆదేశం
ఎన్నికల వేళ మావోయిస్టులు రెచ్చిపోయారు. ఆంధ్రా- ఒడిషా సరిహద్దు ప్రాంతంలో తమ ఉనికిని మరోసారి చాటుకున్నారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పలకజీడి ప్రాంతంలో ఓ పోలింగ్ కేంద్రంపై దాడి చేశారు. రెండు ఈవీఎంలు ఎత్తుకెళ్లి, వాటిని తగులబెట్టారు. అక్కడున్న పోలింగు సిబ్బందికి చెందిన ఓ కమాండర్ జీపును కూడా వారు తగలబెట్టారు. సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా ఇంతకుముందే మావోయిస్టులు పిలుపునిచ్చారు.
అయితే, ఓటర్లు మాత్రం యథావిధిగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో మావోయిస్టులు ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు ఈవీఎంలు ఎత్తుకెళ్లిపోయారు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు గట్టి నిఘా ఉంచినప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం గమనార్హం. అయితే పలకజీడిలో మావోయిస్టులు ఈవీఎంలను దహనం చేయడంతో అక్కడ రీపోలింగుకు ఆదేశిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఇప్పటికపే ఈ సంఘటనపై విచారణకు ఆదేశించామని ఆయన చెప్పారు.