
గురువారం వారణాసిలో మోడీ నామినేషన్
బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ గురువారం వారణాసిలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారం ఉదయమే మోడీ వారణాసి చేరుకుంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా అరవింద్ కేజరీవాల్ బుధవారమే తన నామినేషన్ దాఖలు చేశారు. మోడీ నామినేషన్ దాఖలు చేయడాన్ని ఒక బ్రహాండమైన ఈవెంట్ గా మార్చేందుకు బిజెపి అన్ని విధాలా ప్రయత్నిస్తోంది.
* ఉదయమే బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవీయ, బాబాసాహెబ్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, స్వామీ వివేకానందల విగ్రహాలకు పుష్పమాలలు అర్పించి, రోడ్ షో నిర్వహిస్తారు. ఈ షోలో దాదాపు ఒక లక్ష మంది పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నారు.
* నాలుగు గంటల పాటు రోడ్ షో నిర్వహించిన తరువాత మోడీ నామినేషన్ దాఖలు చేస్తారు.
* వందలాది కిలోల గులాబీ రెక్కలు, పూలు సేకరించి, మోడీపై దారి పొడవునా పూల వాన కురిపించేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధమౌతున్నారు.
* మోడీ నామినేషన్ ను బలపరిచే వారిలో విశ్వనాథ్ సింగ్ అనే చాయ్ వాలా, సంగీత విద్వాంసులు ఛన్నులాల్ మిశ్రలు ఉంటారు.
* ఇప్పటికే నరేంద్ర మోడీ వడోదర నుంచి నామినేషన్ ను దాఖలు చేశారు.