తమ్ముళ్ల పరువు బజారునపడుతోంది. అడ్డదారుల్లో అందలం ఎక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బెడిసికొడుతున్నాయి. ప్రలోభాలపర్వం దాచినా దాగని పరిస్థితి.
సాక్షి ప్రతినిధి, కర్నూలు : తమ్ముళ్ల పరువు బజారునపడుతోంది. అడ్డదారుల్లో అందలం ఎక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బెడిసికొడుతున్నాయి. ప్రలోభాలపర్వం దాచినా దాగని పరిస్థితి. ఎన్నికల నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నా.. ఏదో ఒక రూపంలో వారి బండారం బయటపడుతోంది. నంద్యాలలో మంగళవారం నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులైన శిల్పా మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి బంధువుల ఇళ్లలో భారీగా పట్టుబడిన నగదు ఇందుకు తాజా ఉదాహరణ. సర్వేల్లో ‘వైఎస్‌ఆర్‌సీపీ’ హవా కొనసాగుతుండటం ‘పచ్చ’పార్టీలో గుబులు రేపుతోంది.
ఈ పరిస్థితుల్లో ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వారిలో ఓటమి భయం రెట్టింపవుతోంది. ఫలితంగా నల్లధనం ‘కట్ట’లు తెంచుకుంటోంది. ఉన్నతాధికారుల సమాచారంతో నంద్యాల డీఎస్పీ అమర్‌నాథ్‌నాయుడు మంగళవారం తెల్లవారుజామున పట్టణంలోని నంద్యాల, ఆత్మకూరు టీడీపీ అభ్యర్థులు శిల్పా మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి సమీప బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి రికార్డులు లేని రూ.66 లక్షల నగదును గుర్తించారు. ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకే ఈ డబ్బును సిద్ధం చేసినట్లు డీఎస్పీ వెల్లడించడం గమనార్హం. రెండు రోజుల క్రితం వరకు టీడీపీ అభ్యర్థులు వారి నివాసాల నుంచే డబ్బు పంపిణీ చేయగా.. పోలీసుల నిఘా పెరగడంతో ఇటీవల రూటు మారింది. బంధువులు, సన్నిహితుల నివాసాలకు డబ్బు, గృహోపకరణాలను తరలించి అక్కడి నుంచే కార్యం చక్కబెడుతున్నారు.
ఈ తరహాలో కర్నూలు, నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె, ఆదోని, డోన్, పత్తికొండ ప్రాంతాల్లో టీడీపీ నేతలు ‘సరంజామా’ను ఇప్పటికే చేరవేసినట్లు సమాచారం. డబ్బుతో పాటు క్రికెట్ కిట్‌లు, గ్యాస్ స్టౌలు, ఎల్‌పీజీ సిలిండర్లు, కుట్టు మిషన్లు, చీరలు భారీగా నిల్వ చేసినట్లు తమ్ముళ్లలోనే చర్చ జరుగుతోంది. సుమారు కోటిన్నర రూపాయలకు పైగా నగదు.. చెక్కులను అధికారులు ఇటీవల కాలంలో స్వాధీనం చేసుకోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. పురుషులకు డబ్బు పంపిణీ చేస్తుండగా.. మహిళలను బంగారు నగలతో ఆకట్టుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ముక్కు పుడకలు.. చెవి రింగులు.. ఉంగరాలు.. వెండి నగలను ఓటర్ల ఇళ్లకు చేరవేస్తున్నారు. ఇటీవల కాలంలో పట్టుబడిన బంగారం, వెండి నగలే ఇందుకు నిదర్శనం.
ఇదిలా ఉంటే కొన్నిచోట్ల బ్యాంకుల్లో రుణాలను కూడా ఇప్పిస్తున్నారు. కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఒకరు ఈ తరహా ప్రలోభానికి తెరతీశారు. టీడీపీ నేత ఒకరు ఓ గ్రూపు నుంచి గంపగుత్తగా ఓట్లు రాల్చుకునేందుకు నివాస స్థలాలను అగ్రిమెంట్ చేయిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇదంతా ఎన్నికల స్టంట్ మాత్రమేననే ప్రచారం ఉంది. ఇదిలా ఉండగా.. ఈ డబ్బు వ్యవహారంపై పోలీసులకు ఎవరు ఉప్పందించారో తెలియక శిల్పా సోదరులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు మరో 15 రోజుల్లో ఉండగా రూ.66 లక్షలు పట్టుబడడంతో పరువు పోయినట్లు అయిందని వారు సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిసింది.