* చాలా మండలాల్లో తేలని ఫలితం
* స్వతంత్ర సభ్యుల మద్దతు కోసం ఎంపీపీ ఆశావహుల యత్నాలు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలోని ఎంపీటీసీ ఎన్నికల్లో చాలా మండలాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రానందున ‘హంగ్’ పరిస్థితి ఏర్పడింది. పలు చోట్ల మండలాధ్యక్ష పీఠం ఏ పార్టీకి దక్కుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి మండలాల్లో స్వతంత్ర సభ్యులు, ఒకటీ అరా స్థానాలు సాధించిన పార్టీల పాత్ర కీలకంగా మారింది. దీంతో ఇలాంటి చోట్ల ఎంపీపీ పదవి ఆశిస్తున్న నాయకులు స్వతంత్ర ఎంపీటీసీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల్లోకి చేజారిపోకుండా కాపాడుకునేందుకు అప్పుడే ఇండిపెండెంటు ఎంపీటీసీలను తమ శిబిరాల్లో చేర్చుకుని కుటుంబ సభ్యులతో కలిపి విహార యాత్రలకు తీసుకెళుతున్నారు. దీంతో పోటాపోటీగా క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి.
ప్రకాశం జిల్లాలో మొత్తం 56 మండలాలు ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు 27 చోట్ల, టీడీపీకి 19 చోట్ల స్పష్టమైన మెజారిటీ ఉంది. మిగిలిన 10 స్థానాల్లో నాలుగు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలకు సమాన స్థాయిలో ఎంపీటీసీ స్థానాలు లభించాయి. దీంతో ఈ నాలుగు చోట్ల మండల పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికో లాటరీలోనే తేలనుంది. ఈ జిల్లాల్లోని కనిగిరి, చీరాల, ఉలవపాడు, కంభం, వేటపాలం మండలాల్లో హంగ్ నెలకొంది. వేటపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 4, టీడీపీకి 5 స్థానాలు దక్కగా 12 చోట్ల ఇండిపెండెంట్లు ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించారు. దీంతో ఇక్కడ వీరిదే కీలక పాత్ర కానుంది. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 11, కాంగ్రెస్‌కు 9, టీడీపీకి నాలుగు ఎంపీటీసీ స్థానాలు లభించాయి. దీంతో ఇక్కడ టీడీపీ మద్దతు ఉన్న వారికే మండలాధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది.
‘లక్కీ’ చైర్మన్లు..
పలు మండలాల్లో ఇరు పక్షాలకు సమానమైన స్థాయిలో ఎంపీటీసీ స్థానాలు లభించాయి. దీంతో ఈ స్థానాల్లో మండలాధ్యక్ష పదవి ఎన్నికకు లక్కీ డిప్ (లాటరీ) శరణ్యంగా మారింది. ఇలా లాటరీ ద్వారా మండల పరిషత్ చైర్మన్లుగా ఎంపికయ్యేవారిని ‘లక్కీ’ చైర్మన్లు అనే పరిస్థితి ఏర్పడింది. చాలా మండలాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు వైఎస్సార్ జిల్లా కమలాపురంలో మొత్తం 12 ఎంపీటీసీలు ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు చెరి ఆరు స్థానాల్లో విజయం సాధించాయి. ఇదే జిల్లాలోని వల్లూరు మండలంలో పది ఎంపీటీసీలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ టీడీపీలు చెరో ఐదు స్థానాలను కైవసం చేసుకున్నాయి. కర్నూలు జిల్లా డోన్ మండలం కూడా టై అయింది. ఇక్కడ మొత్తం 18 ఎంపీటీసీలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు చెరి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో ఈ స్థానాల్లో ఎంపీపీ ఏ పార్టీకి అనే విషయాన్ని అధికారులు లాటరీ ద్వారా నిర్ణయించనున్నారు.
స్వతంత్రులకు ‘హంగ్’ పండగ
Published Wed, May 14 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM
Advertisement
Advertisement