సాక్షి, గుంటూరు :బెట్టింగ్... ఒకప్పుడు ఐపీఎల్, టెస్ట్‌మ్యాచ్‌లు, వన్డే మ్యాచ్‌ల సందర్బంలో వినిపించే పదం. ఇప్పుడు ఎన్నికల ఫలితాలపైనా బెట్టింగ్ జోరందుకుంది. ఈ ఏడాది మార్చినెల నుంచి మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికలు వరుసగా జరగడం, మే 12, 13, 16 తేదీల్లో వీటి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరికెన్ని సీట్లు వస్తాయి అనేఅంశాలపై భారీ ఎత్తున పందేలు కాశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 200 కోట్లకు పైగా పందేలు జరిగాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
రంగంలోకి దిగిన బుకీలు
ఈ పందేలు పకడ్బందీగా నిర్వహించేందుకు కొందరు బుకీలు రంగంలోకి దిగారు. పందాలు కాసిన ఇరుపార్టీలనుంచి నగదు ఓ మధ్యవర్తిదగ్గర ఉంచేలా ఒప్పందాలు చేసుకున్నారు. అందులో ఎవరు గెలిస్తే మధ్యవర్తి ఆ మొత్తాన్ని వారికిచ్చేయాలన్నమాట. కోట్ల రూపాయల్లో పందాలు కాసినవారు అంత మొత్తం దాచలేక స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను షూరిటీ పెట్టే ఏర్పాటు చేశారు. గెలిచినవారికి నిర్థిష్ట గడువులోగా డబ్బు చెల్లించకుంటే ఓడినవారి ఆస్తులు స్వాధీనం చేసుకునేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ మేరకు అగ్రిమెంటు పత్రాలు రాసుకున్నారు.
సోమవారం రాత్రి గుంటూరు నగరంలోని ఓ లాడ్జిలో భారీ మొత్తంలో పందెం డబ్బు చేతులు మారుతున్న విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు కొందరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తి దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం రూ. 7 లక్షలు మాత్రమే నగదు దొరకిందని వారు తెలిపినప్పటికీ దాడుల సమయంలో లాడ్జి కింద ఉన్న ఇన్నోవా వాహనంలో కోట్ల రూపాయల డబ్బుతో మధ్యవర్తి ఒకరు ఉన్నట్లు సమాచారం. పోలీసులు రావడాన్ని గమనించిన ఆయన ఆ కారులోనే ఉడాయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ డబ్బు, స్థిరాస్తి దస్తావేజులు టీడీపీకి చెందిన నాయకులది కావడంతో ప్రమాణ స్వీకారాలు చేయకముందే పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసును నీరుగార్చారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థిరాస్తి దస్తావేజులను పక్కకు తప్పించి కేవలం లక్షల్లో మాత్రమే వారిని చూపిస్తున్నట్లు చెబుతున్నారు.
మామూలుగానే వ్యవహరించిన పోలీసులు
బాహాటంగానే ఈ వ్యవహారాలు జిల్లా వ్యాప్తంగా సాగుతున్నా పోలీసులు వాటిని షరా మామూలుగానే చూసీచూడనట్టు వదిలేశారు. గెస్ట్‌హౌస్‌లు, లాడ్జీల్లో ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు సహాయంతో ఢిల్లీ, ముంబాయి వంటి నగరాల్లో ఉన్న బుకీలతో ఆన్‌లైన్ ద్వారా పందేలు కాస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. కొందరు మాత్రం ఊబిలో దిగి అప్పుల పాలై రోడ్డున పడుతున్నారు. కొందరైతే అప్పు తీర్చలేక , వారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ లీగ్ స్థాయి నుంచి సెమీఫైనల్స్‌కు చేరనుండటంతో పందేల జోరు మరింత పెరిగింది. ఇప్పటికైనా పోలీసు అధికారులు బెట్టింగ్ రాయుళ్ళపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బెట్టింగ్‌లే... బెట్టింగ్‌లు
Published Wed, May 21 2014 12:39 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement