9న మున్సిపోల్స్ ఫలితాలు | municipal polls results on 9th april | Sakshi
Sakshi News home page

9న మున్సిపోల్స్ ఫలితాలు

Published Wed, Apr 2 2014 1:48 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

9న మున్సిపోల్స్ ఫలితాలు - Sakshi

9న మున్సిపోల్స్ ఫలితాలు

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు
 అదే రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ నెల 9వ తేదీన విడుదల కానున్నాయి. ఆ రోజున ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. లెక్కింపు ముగిసిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు మంగళవారం హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి ఇదివరకు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలపై ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్లి.. ఫలితాలు నిలిపేయాలంటూ సుప్రీం ఆదేశిస్తే తప్ప ఈ ప్రక్రియ ఆగే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ నెల 6, 11 తేదీల్లో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపును సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసే (మే 7వ తేదీ) వరకు నిలిపి ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల విడుదలపై ఇంకా సందిగ్ధం వీడడం లేదు.
 
 రాష్ట్రంలోని 145 మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లకు మార్చి 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల రెండో తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరగాల్సి ఉంది. అయితే త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వాటిపై ప్రభావం చూపిస్తాయని, అందువల్ల ఫలితాలను సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రకటించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. నల్లగొండ జిల్లాకు చెందిన బుక్యా సైదా, నెల్లూరు జిల్లాకు చెందిన న్యాయవాదులు రమేష్‌రెడ్డి, ఎన్నికల నిఘా వేదిక కార్యనిర్వాహక కార్యదర్శి వి.వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఫలితాలను సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసేవరకూ నిలిపివేసేలా ఆదేశించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కానీ, బుధవారం జరగాల్సిన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజున ఓట్లను లెక్కించి, ఫలితాలను కూడా ప్రకటించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
 
 షెడ్యూల్ మార్చడం సాధ్యం కాదు..
 
 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన షెడ్యూల్‌కు మార్పులు చేసినట్లుగా... మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇప్పటికే ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. వాయిదా వేస్తే ఈవీఎంలకు రక్షణ కల్పించడం కష్టమవుతుందన్న ఎన్నికల సంఘం వాదనను సమర్థించింది. అయితే, సుప్రీంకోర్టులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల వాయిదాను వ్యతిరేకించని ఎన్నికల సంఘం.. హైకోర్టులో మాత్రం మున్సిపల్ ఎన్నికల ఫలితాల వాయిదాను వ్యతిరేకిస్తుండటాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇటువంటి వైఖరి సరికాదని పేర్కొంది. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ జారీ అయ్యాక.. ఏ న్యాయస్థానం కూడా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం ప్రస్తావించింది. ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తే వాటి వల్ల ఓటర్లు ప్రభావితులవుతారని, సార్వత్రిక ఎన్నికలపై కూడా ప్రభావం ఉంటుందని సుప్రీంకోర్టు ఎక్కడా తన ఉత్తర్వుల్లో పేర్కొనలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
 
 సుప్రీం ఇవ్వని స్పష్టత మేమెలా ఇస్తాం..?
 
 హైకోర్టులో మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది కొండం రామకృష్ణారెడ్డి వాదన వినిపించగా... రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున వి.వి.ప్రభాకరరావు వాదించారు. ఉదయం పిటిషన్లపై విచారణ ప్రారంభం కాగానే ఎన్నికల అంశంపై సుప్రీంకోర్టు స్పష్టత గురించి న్యాయమూర్తులు ఆరా తీశారు. తాము స్పష్టత కోసం సుప్రీంకోర్టు ముందు మౌఖికంగా ప్రస్తావన చేశామని.. కానీ, కోర్టు తమ ప్రస్తావనను తోసిపుచ్చిందని ప్రభాకరరావు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
 
 దీంతో సుప్రీంకోర్టే స్పష్టత ఇవ్వనప్పుడు, తామెలా స్పష్టతనిస్తామని... కేసు పూర్వాపరాల ఆధారంగా ఈ కేసులో నిర్ణయం వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏప్రిల్ 10వ తేదీ లోపు మునిసిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని తాము ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ను ఆదేశించామని, ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ఉత్తర్వులివ్వలేమని తెలిపింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు పిటిషనర్ల ప్రయోజనాలను కాపాడుతామని చెప్పింది. ఈ సమయంలో రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... అలాంటి ఉత్తర్వులిస్తే తమకు అభ్యంతరం లేదని, ఈ లోపు (9వ తేదీలోపు) తాము సుప్రీంకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకుంటామని చెప్పారు. తరువాత వాదనలు వివిధ అంశాలవైపు వెళ్లి సుదీర్ఘంగా సాగాయి. దీంతో ఈ వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టివేయడం ఖాయమని పిటిషనర్లు, ఎన్నికల సంఘం న్యాయవాదులు భావించారు. కానీ, 9వ తేదీన ఓట్లు లెక్కించి, అదే రోజున ఫలితాలను ప్రకటించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
 సుప్రీం ఆదేశిస్తే తప్ప ఆపలేం: రమాకాంత్‌రెడ్డి
 
 మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఈ నెల 9వ తేదీన ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదలపై మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదలను ఆపాలంటూ ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్లి... వారికి అనుకూలంగా సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వస్తే తప్ప ఓట్ల లెక్కింపును ఆపేది లేదని స్పష్టం చేశారు. 9వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తామని.. లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఎన్నికలు పూర్తయిన మున్సిపాలిటీల్లో ఓటింగ్ యంత్రాలకు గట్టి భద్రత కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. మున్సిపల్ వార్డులు, డివిజన్ల ఫలితాల అనంతరం పరోక్షంగా ఎన్నుకునే చైర్మన్, మేయర్ పదవులకు ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఈ పరోక్ష ఎన్నికల షెడ్యూల్ మార్చి 20వ  తేదీనే జారీ కావాల్సి ఉన్నా.. ఇంకా విడుదల చేయలేదు.
 
 రీ పోలింగ్ ప్రశాంతం..
 
 నాలుగు మున్సిపాలిటీల్లోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కృష్ణా జిల్లా నందిగామలో 19వ వార్డులోని ఒకటి, రెండు కేంద్రాల్లో 80.05 శాతం, నల్లగొండ జిల్లా సూర్యాపేట మున్సిపాలిటీలో 17వ వార్డులోని ఒకటి, రెండు కేంద్రాల్లో 78.93, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి మున్సిపాలిటీలో 14వ వార్డులోని ఒకటో కేంద్రంలో 65.42, అనంతపురం జిల్లా తాడిపత్రి 12వ వార్డులోని మూడో పోలింగ్ కేంద్రంలో 69.91 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement