వికారాబాద్, న్యూస్‌లైన్: విలువైన వస్తువులను ఎర వేసి ఓట్ల చేపలను బుట్టలో పడవేసేందుకు మున్సిపల్ అభ్యర్థులు గాలాలు వేస్తున్నారు. కాదేదీ ఎన్నికల తాయిలాలకు అనర్హం అన్నట్లుగా.. గుండుగుత్తగా ఓట్లను దండుకునేందుకు విలువైన గృహోపకరణాలు, బంగారు ఉంగరాలు, పట్టు చీరల ఎర వేస్తున్నారు. ఓటుకో రేటు కట్టి మరీ బేరాలాడుతున్నారు. సకల రాచ మర్యాదలతో మచ్చిక చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఆఖరి ఘట్టానికి చేరుకోవడంతో అభ్యర్థులు చివరి ప్రయత్నంగా అన్ని అస్త్రాలను సంధిస్తున్నారు. వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, వారి కుటుంబీకులు, స్నేహితులు కలిసి ఓటర్లను కలుస్తున్నారు. తమకే ఓటు వేయాలని వేడుకుంటున్నారు.
వరుసలు కలుపుతూ మచ్చిక చేసుకొంటున్నారు. శర పరంపరగా హామీల వర్షం కురిపిస్తున్నారు. డబ్బుతో పాటు కలర్ టీవీలు, ఫ్రిజ్‌లు, సెల్‌ఫోన్లు, బంగారు ఉంగరాలు, ఆడపడచులకు పట్టు చీరలు ఇస్తామని రహస్యంగా ఎర వేస్తున్నారు. వారం రోజులుగా వికారాబాద్‌లో మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 12 వార్డులో రెండు రోజుల క్రితం ఓ పార్టీ నాయకుడు పట్టు చీరలు, మద్యం పంపిణీ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు చూసీ చూడన్నట్లు ఊర్కున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాము ఓడితే భవితవ్యమేంటని ప్రధానంగా పట్టణంలోని జనరల్ వార్డుల అభ్యర్థులు ప్రశ్నించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చావోరేవో తేల్చుకోవాలని భావించి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచి తీరాలనే కాంక్షతో అన్ని దారులనూ ఆశ్రయిస్తున్నారు.
తమ ఆర్థిక స్థోమతను బట్టి ఓటర్లకు విలువైన వస్తువులను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. 3, 4, 10, 12, 24 వార్డుల్లో నువ్వా.. నేనా అనే తరహాలో పోటీ ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఓటర్లతో బేరాలకు దిగుతున్నారు. కలర్ టీవీ, ఫ్రిజ్, సెల్‌ఫోన్, బంగారు ఉంగరాలు, పట్టుచీరలు తదితర విలువైన వస్తువులను ఓటర్లకు ఎర వేస్తున్నారు. ఏదీ వద్దంటే ఓటుకు ఎంత నోటు కావాలో చెప్పాలంటూ క్యాష్ ఇస్తున్నారు. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి. మీ రేటు ఎంత చెప్పండి. నాకే ఓటేయండి. నన్నే గెలిపించండి అంటూ అభ్యర్థిస్తున్నారు.
టీవీ.. సెల్‌ఫోన్!
Published Fri, Mar 28 2014 12:02 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement