జైలులో ఉండి ఎంపీటీసీగా గెలిచిన శంకర్
కమాన్‌పూర్: కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట గ్రామానికి చెందిన తాళ్ల శంకర్ జైలులో ఉండి ఎంపీటీసీ అభ్యర్థిగా గెలుపొందారు. మండలంలోని నాగారం ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత ఐదు రోజులకు శంకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి నుంచి రామగుండం ఎన్‌టీపీసీకి వెళ్లే రైలు నుంచి బొగ్గు దొంగిలిస్తున్నాడని సెక్యూరిటీ సిబ్బంది శంకర్‌పై గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు శంకర్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించగా, ప్రస్తుతం ఆయన జైలులోనే ఉన్నాడు. తన భర్తను కావాలనే కొందరు జైలులో పెట్టించారని ఆరోపిస్తూ ఆయన భార్య ఒంటరిగా ప్రచారం చేసి భర్తను గెలుపించుకున్నారు. శంకర్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జంగిలి అంజిపై 180 ఓట్ల మెజారిటీ సాధించడం విశేషం.