తమ్ముళ్లను నమ్మొచ్చా?
- టీడీపీ అభ్యర్థుల్లో అంతర్మథనం
- తాయిళాల పంపిణీ ఎలా అన్న సందేహం
- అనుచరుల్ని నమ్ముకుంటే పోలా అని నిర్ణయం
నక్కపల్లి, న్యూస్‌లైన్: అసలే ఎన్నికల వేళ... పరిస్థితి చూస్తే అంతంతమాత్రంగా ఉంది... కనీసం తాయిళాలిచ్చైనా ఓటర్లను ప్రసన్నం చేసుకుందామంటే అదీ అంత ‘వీజీ’లా లేదు. ఇప్పుడెలా? టీడీపీ అభ్యర్థుల అంతర్మథనమిది. అసలే మూడు వర్గాలు... ఆరు గ్రూపుల గోలతో సతమతమవుతుంటే పోనీ ఇచ్చిందయినా సక్రమంగా ఓటరుకు చేరుతుందా? లేక మధ్యలోనే మింగేస్తారా? అన్నదే వీరి అనుమానం.
అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఈ అంశమే చర్చనీయాంశం. తెలుగు తమ్ముళ్ల మధ్య హాట్ టాపిక్‌లా చర్చ సాగుతోంది. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం స్థానంలో ఎంపీ అభ్యర్థితోపాటు పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు స్థానికేతరులే కావడంతో వీరంతా పూర్తిగా పార్టీ కేడర్‌పైనే ఆధారపడి కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైఎస్సార్ సీపీ ప్రభంజనం కొనసాగుతోంది. జగన్‌మోహన్‌రెడ్డికి ఒకసారి అధికారమిద్దామన్న కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో టీడీపీ నాయకులు ఎంత డబ్బు వెదజల్లి ఎన్ని ఆశలు చూపినా ఓటర్లు మాత్రం వైఎస్సార్ సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ కార్యకర్తలు, నాయకుల ద్వారా డబ్బు పంపిణీ చేస్తే ఓటర్లకు చేరుతుందా అన్న గుబు లు అభ్యర్థులను వేధిస్తోంది. ప్రధానంగా ‘ఎలాగూ ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు కావున, ఇప్పుడు డబ్బులిచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని, ఈ పరిస్థితుల్లో అభ్యర్థులిచ్చిన మొత్తం కాస్తా మనమే నొక్కేస్తే నాలుగు రాళ్లు వెనుకేసుకున్నట్లు ఉంటుంది కదా’ అన్న ఆలోచన పలువురు తమ్ముళ్లు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పైగా మరో ఐదేళ్ల వరకు ఎన్నికలుండవు, ఈ ఎన్నికల తర్వాత అభ్యర్థులు పలకరించిన పాపాన పోరు. ఈ పరిస్థితుల్లో అందినకాడికి వెనుకేసుకోవడమే మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మంది తమ్ముళ్లలో ఉన్నట్లు సమాచారం. ఆ నోటా ఈ నోటా విస్తరించిన ఈ మాటలు చివరికి అభ్యర్థుల చెవుల్లోకి చేరాయి. దీంతో డబ్బులు పంచినా ఓటర్లకు చేరుతాయన్న గ్యారంటీ లేదన్న నమ్మకానికి అభ్యర్థులు వచ్చేశారు.
పైగా ఎన్నికల ముందు పలువురు కాంగ్రెస్ నాయకులు టీడీపీలో చేరారు. ఎప్పటి నుంచో ఉన్న తెలుగు తమ్ముళ్లకు, వీరికి మధ్య అసలు పొసగడం లేదు. దీంతో ఓటర్లకు పంచే డబ్బులు మా ద్వారా పంపిణీ జరగాలంటే... మా ద్వారా జరగాలంటూ రెండు వర్గాలు అభ్యర్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఒక వర్గానికి ఇచ్చి మరొక వర్గానికి ఇవ్వకపోతే ఏ చిక్కు వచ్చిపడుతుందోననే భయం అభ్యర్థులను వెంటాడుతోంది. దీంతో అభ్యర్థులు పునరాలోచనలో పడ్డారని సమాచారం.
సొంతవారితోనే కొంత మేలు
స్థానికంగా ఉన్న తెలుగు తమ్ముళ్లను నమ్ముకునే కంటే తమ వారిని నమ్ముకుంటేనే కొంతై నా మేలు జరుగుతుందని అభ్యర్థులు భావిస్తున్నట్లు స మాచారం. ఒక అభ్యర్థి అయితే ఏకంగా తన సంస్థల్లో పనిచే సే సిబ్బందిని, చదువుతున్న విద్యార్థులతోపాటు తన సొం త ప్రాంతానికి చెందిన వారితో తాయిళాలు పంపిణీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సదరు అభ్యర్థి అనుచర గణం గ్రామాల్లో ఈ దిశగా పనిచేస్తున్నారు.
పార్టీ జెండాలు, స్టిక్కర్లు, పోస్టర్లను వారే పంపిణీ చేస్తున్నారు. దీన్ని చూసి స్థానిక తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. జెండాలు మోసే తమను కాదని వారి సొంత మనుషులతో ఎలాపంపిణీ చేస్తారో చూద్దామంటూ తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఉప ఎన్నికల్లో ఇలా వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వచ్చి పెత్తనం చేయడంవల్లే కాంగ్రెస్, టీడీపీలు పరాజయం పాలయ్యాయనే విషయాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. అభ్యర్థులు తమ వారితో డబ్బులు పంపిణీ చేయిస్తారా? లేక ఏదయితే అదయిందిలే అని స్థానికంగా ఉన్న కార్యకర్తలకే ఇస్తారా చూడాలి.