
ఒక్క సీటూ ఇవ్వొద్దు:నరేంద్ర మోడీ
డీఎఫ్‌ను ఖాతా తెరవనివ్వకండి కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో మోడీ
కల్యాణ్ ఎన్నికల సభలో అభిమానుల బహుకరించిన పూలదండతో మోడీ, ఉద్ధవ్
కల్యాణ్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ఎన్సీపీ(డీఎఫ్) కూటమికి ఒక్క సీటు రాకుండా రాష్ట్ర ప్రజలు తీర్పునివ్వాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కల్యాణ్‌లో సోమవారం జరిగిన మహాకూటమి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కంటే కాంగ్రెస్ పార్టీ తనపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయిస్తుందని మోడీ మండిపడ్డారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 232 లోక్‌సభ స్థానాల జరిగిన ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ స్థానాలు వస్తాయని గ్రహించిన కాంగ్రెస్ తనను ఆపేందుకు ప్రయత్నిస్తుందన్నారు.
ఎన్నికలు జరగబోయే మరిన్ని దశలలోనూ బీజేపీకే ఎక్కువ స్థానాలు ఇచ్చి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. అప్పడు దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు మార్గం సుగమమవుతుందని తెలిపారు.మే 16 తర్వాత తమ స్థానమెంటో తెలుసుకున్న కాంగ్రెస్, తనని ఆత్మరక్షణలో పడేయాలన్న ఏకైక ఎజెండాతో పనిచేస్తుందని ఆరోపించారు. మురికివాడ రహిత, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీలిచ్చిన యూపీఏ, అవి నెరవేర్చడంలో విఫలమైందని మోడీ మండిపడ్డారు.
కాగా, ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే మద్దతు విషయంలో మోడీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు తికమకపడాల్సిన అవసరం లేదని, మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. తొలిసారిగా మోడీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే గుజరాత్ ముఖ్యమంత్రి మోడీపై ప్రశంసలు కురిపించారు. సుస్థిర పాలన అందించే నాయకత్వం ఆయన సొంతమని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎఫ్ కూటమి పాలన అవినీతిమయంగా మారిందన్నారు.