యూపీలో ఫైట్లు.. ఢిల్లీలో డ్యూయెట్లు
కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలపై మోడీ ధ్వజం
కేంద్రంలో అధికారం కోసం ఒక్కటవుతాయి
బిజ్నోర్/అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్ల మాదిరిగా పరస్పరం తన్నుకుంటున్నాయని, కానీ కేంద్రంలో మాత్రం అధికారం కోసం ఒక్కటవుతాయని గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్‌లు ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, లౌకికవాదం పేరుతో ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆదివారం యూపీలోని బిజ్నోర్‌లో జరిగిన ర్యాలీలో మోడీ ఈ మేరకు విమర్శనాస్త్రాలు సంధించారు.
‘కాంగ్రెస్‌కు యూపీలో ఇద్దరు (ఎస్పీ, బీఎస్పీ) సైనికులు ఉన్నారు. వీరంతా టీవీల్లో ప్రసారమయ్యే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్స్ మాదిరిగా తన్నుకుంటారు. రాష్ట్రస్థాయిలో లక్నోలో తన్నుకునే వీరే.. ఢిల్లీలో అధికారం కోసం మాత్రం ఒక్కటవుతారు’ అని మోడీ ఎద్దేవాచేశారు. ఈ మూడు పార్టీలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, దేశంలో మార్పు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ‘మీరు ఇప్పటికే బాధలు అనుభవించారు. మీ పిల్లలు ఆ బాధలకు గురికాకుండా చేయండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. మార్పు తేవాలని ప్రజలు అనుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో సీబీఐ కూడా యూపీఏను గట్టెక్కించలేదన్నారు. అలాగే ఆదివారం అలీగఢ్‌లో జరిగిన ర్యాలీలోనూ మోడీ మాట్లాడారు.
మోడీ ఇంకా ఏమన్నారంటే...
బలహీనమైన ఉపాధ్యాయుడు ఉంటే స్కూలుకు వెళ్లేందుకు పిల్లలు సైతం ఇష్టపడరు. అందుకే బీజేపీకి 300కు పైగా సీట్లు కట్టబెట్టి బలమైన ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించండి.
60 ఏళ్లుగా పాలకులను ఎన్నుకున్నారు. ఈసారి 60 నెలల కాలానికి ఓ సేవకుడిని ఎన్నుకోండి. ఇంతవరకూ వారు చేయలేని పనిని నేను చే సి చూపిస్తా.
సోనియా నేతృత్వంలోని యూపీఏ హయాంలో గతేడాది కాలంలో దేశవ్యాప్తంగా 700 అల్లర్లు చోటుచేసుకున్నాయి. వాటిలో 250 మతఘర్షణలు ఒక్క యూపీలో నేతాజీ (ములాయం) పార్టీ పాలనలోనే జరిగాయి.
దేశంలోని 90 ముస్లిం ఆధిక్య జిల్లాల్లో 15 అంశాల కార్యక్రమం గురించి సోనియా ఇటీవల మాట్లాడారు. కానీ అందుకు పైసా కూడా ఖర్చు చేయలేదు. ముస్లింలను వారు తప్పుదోవ పట్టిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం.
వాజ్‌పేయి, అద్వానీల త్యాగాలు ఎనలేనివి...
బీజేపీలో పార్టీ కురువృద్ధులను పక్కన పెడుతున్నారన్న విమర్శల నేపథ్యంలో పెద్దలను సంతృప్తిపర్చేందుకు ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రయత్నించారు.
బీజేపీ 34వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం దేశవ్యాప్తంగా 6 లక్షల పోలింగ్ బూత్‌ల పరిధిలోని పార్టీ కార్యకర్తలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీ ఢిల్లీ నుంచి ప్రసంగించారు. బీజేపీ కోసం నాలుగు తరాల నేతలు ఎనలేని త్యాగాలు చేశారని, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, అగ్రనేత ఎల్‌కే అద్వానీలు ఎప్పుడూ తనకు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు.
300 చోట్ల మోడీ త్రీడీ ప్రసంగం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా నరేంద్ర మోడీ ప్రసంగాన్ని త్రీడీ రూపంలో పెద్ద ఎత్తున ప్రదర్శించేందుకు బీజేపీ సన్నద్ధమైంది. సోమవారం ఢిల్లీలో 18 కేంద్రాలతో సహా దేశవ్యాప్తంగా మొత్తం 300 చోట్ల మోడీ ప్రసంగాన్ని త్రీడీ రూపంలో ప్రదర్శించనున్నట్లు ఆ పార్టీ ఢిల్లీ నేత హరీశ్ ఖురానా వెల్లడించారు. త్రీడీ టెక్నాలజీ వల్ల అన్ని చోట్లా వేదికలపై నరేంద్ర మోడీ స్వయంగా హాజరై ప్రసంగిస్తున్నట్లు కనిపించడం తెలిసిందే.