మాగుంట ఎంపీగా ఈ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులే అయినా, తెలుగుదేశం కార్యకర్తలకు నాయకుడిగా అనుబంధం లేదు.
మాగుంట ఎంపీగా ఈ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులే అయినా, తెలుగుదేశం కార్యకర్తలకు నాయకుడిగా అనుబంధం లేదు. నామినేషన్లు వేయడానికి మరో రెండు రోజుల సమయం ఉండగా, మాగుంట టీడీపీలో చేరారు. అప్పటి వరకు ఏ పార్టీలో చేరాలనే విషయంపై ఆయనకు స్పష్టత లేదు. టీడీపీ ఒక దశలో ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని అనుకున్న విషయం తెలిసిందే. దీంతో మాగుంట టీడీపీలో చేరాలా, బీజేపీలో చేరాలా అని చివరి పది రోజులు మదనపడ్డారు. చివరకు తెలుగుదేశంలో చే రి
ఆ పార్టీ టికెట్టు సంపాదించారు.
అకస్మాత్తుగా ఊడిపడిన నాయకుడు కావడంతో తెలుగు తమ్ముళ్లు ఆయనకు దగ్గర కాలేకపోతున్నారు. దీంతో పాటు జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, సీనియర్ నేత కరణం బలరాం లాంటి నేతలు ఆయనకు ప్రచారంలో సహకరించడం లేదని తెలుస్తోంది. గెలుపుపై తక్కువ ఆశలున్న దామచర్ల జనార్దన్ తనకు తానే ప్రచారం చేసుకోవడం లేదు. మాగుంటకు ప్రచారం చేయడం వల్ల తనకు వచ్చే లాభమేమిటని అనుకుంటున్న ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ నుంచి మాగుంటతో వచ్చిన ఆయన సన్నిహిత వర్గం ఎన్నికల ప్రచారం చేస్తూ ‘మాగుంటకు ఓటెయ్యండి కాంగ్రెస్‌ను గెలిపించండి’ అని ప్రచారం చేసి నాలుక కరుచుకుంటున్నారు. ఇటీవల మాగుంట కొండపి నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వెళ్లగా ఆయన వెంట, అక్కడి టీడీపీ నాయకులు ఆశించినంత మంది రాకపోవడంతో విసుగు ప్రదర్శించినట్లు తెలిసింది. మాగుంటతో గతంలో అనుబంధం ఉన్న చిన్న కార్యకర్తలు మినహా, పెద్ద నాయకులు రాకపోవడం ఆయన్ను ఆవేదనకు గురిచేసింది.
కనిగిరి నియోజకవర్గం పామూరులో చేసిన ప్రచారంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. మాగుంట సామాజికవర్గానికి చెందిన పలువురు నేతలు మినహా, మిగిలిన వారు ఆయనతో కలసి ప్రచారం చేయలేదు. తెలుగుదేశం నేతలను నమ్ముకుంటే కష్టమని భావిస్తున్న మాగుంట, తన వదిన పార్వతమ్మతోపాటు, కుటుంబ సభ్యులను ప్రచారానికి సహకరించాలని కోరుతున్నట్లు తెలిసింది.