
కిషన్ వద్దు.. బాబే ముద్దు
బీజేపీ-టీడీపీ పొత్తు వ్యవహారంతో కమలనాథుల్లో అభిప్రాయభేదాలేర్పడ్డాయనటానికి ఇదే నిదర్శనం. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ రూపొందించుకున్న ప్రచార రథమిది. వీటిని పార్టీ కార్యాలయం ఎదుట సీనియర్ నేత, మాజీ గవర్నర్ వి.రామారావు ప్రారంభించారు. కానీ ఈ రథాలపై ఎక్కడా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చిత్రం లేకపోవటం విశేషం. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మలు మాత్రం ఏర్పాటు చేశారు.
టీడీపీతో పొత్తుండాలని గట్టిగా కోరిన నేతల్లో దత్తాత్రేయ ఒకరు. పొత్తు వద్దేవద్దంటూ కిషన్‌రెడ్డి గట్టిగా వాదించారు. పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, చంద్రబాబు, తన బొమ్మలు వేయించుకున్న దత్తన్న కిషన్‌రెడ్డి బొమ్మ లేకుండానే వాటిని సిద్ధం చేయించటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వీటి ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కిషన్‌రెడ్డి... దత్తన్న వ్యవహారంతో చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది.