
జూన్ 2 వరకు ఎమ్మెల్యేలకు నిరీక్షణే!
* కొత్తగా ఎన్నికైన వారు అప్పటివరకు ప్రమాణం చేసే అవకాశం లేదు
* విభజన నేపథ్యంలో రాష్ట్రంలో అసాధారణ స్థితి
* జూన్ 1వ తేదీ రాత్రి లేదా 2వ తేదీ ఉదయానికి రాష్ట్రపతి పాలన ఎత్తివేత!
* అపాయింటెడ్ డేనాడే రెండు అసెంబ్లీల భేటీ
* ఉదయం ఒక రాష్ట్ర అసెంబ్లీ, మధ్యాహ్నం మరో రాష్ట్ర శాసనసభ సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలు, 42 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈనెల 30న, వచ్చేనెల 7న రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి నిర్ణయించారు. అంటే ఆరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడతాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి, కొత్త రాష్ట్రాలు ఏర్పడటానికి మధ్య 17 రోజుల సమయం ఉంటుంది. అంటే.. కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు వెంటనే కొత్త ప్రభుత్వాలు ఏర్పాటుచేసుకోలేక ఇన్ని రోజులూ ఖాళీగా ఉండాలి. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, కొత్త ప్రభుత్వాలు ఎప్పుడు ఏర్పడతాయి, రాష్ట్రపతి పాలన ఎప్పుడు రద్దవుతుంది, అపాయింటెడ్ డే నాటికి రెండు రాష్ట్రాలకు వేర్వేరు అసెంబ్లీల ఏర్పాటుకు ఆటంకాలేమైనా ఎదురవుతాయా వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారా? లేక రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాతా అన్న దానిపై అధికార, రాజకీయవర్గాల్లో స్పష్టత లేదు.
రాష్ట్ర విభజనకు ముందుగా ప్రమాణస్వీకారం చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాప్రతినిధిగా ప్రమాణం చేయాల్సి ఉంటుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అలాకాకుండా విభజన జరిగిన తర్వాత అయితే ఏ రాష్ట్రానికి చెందిన వారు ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులుగా ప్రమాణం చేస్తారని ఆ వర్గాలు అంటున్నాయి. ఎన్నికైనప్పటినుంచి ఆరు నెలల్లోగా ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంటుందని అసెంబ్లీవర్గాలు చెబుతున్నాయి. అందువల్ల జూన్ 2న కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాతే ప్రమాణం స్వీకారం చేసే అవకాశముంటుందని అంటున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నందున, అపాయింటెడ్ డే అయిన జూన్ 2న కొత్త అసెంబ్లీలను ఏర్పాటుచేయాలంటే ముందుగా దాన్ని ఎత్తివేయాలి. అందుకు కేంద్ర కేబినెట్ సిఫార్సు అవసరం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ రాకపోతే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ప్రస్తుతమున్న కేబినెట్ ఆపద్ధర్మంగా కొనసాగుతుందని, అదే రాష్ట్రపతి పాలన తొలగిస్తుందని అసెంబ్లీవర్గాలు అంటున్నాయి. రాజ్యాంగ, పాలనపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే అపాయింటెడ్ డే అమల్లోకి వచ్చే సమయంలోనే రాష్ట్రపతిపాలన రద్దయ్యేలా ఆదేశాలు జారీ చేస్తారని చెబుతున్నారు. అంటే.. జూన్ 1 రాత్రి లేదా 2వ తేదీ ఉదయం వరకు రాష్ట్రపతి పాలన అమల్లో ఉంటుందని అంటున్నారు.
2న రెండు అసెంబ్లీల సమావేశాలు!
జూన్ 2వ తేదీన రెండు రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వేరుగా సమావేశమవుతాయని అధికారవర్గాలు వెల్లడించాయి. ఇప్పుడున్న అసెంబ్లీ భవనంలోనే ఉదయం ఒక రాష్ట్ర అసెంబ్లీ సమావేశం, మధ్యాహ్నం మరో రాష్ట్ర సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయని ఆవర్గాలు తెలిపాయి. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ సభ్యుల జాబితాతోపాటు సమగ్ర సమాచారం మే 28లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి చేరుతుంది. కేంద్రం వినతి మేరకు ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాలకు ఎమ్మెల్యేలను వేరు చేసి ఆ జాబితాలను గవర్నర్‌కు పంపిస్తుంది. గవర్నర్ ఆ జాబితాపై గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తారని, ఆపై రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు, అసెంబ్లీల సమావేశాలకూ నోటిఫికేషన్ ఇస్తారని చెబుతున్నారు. జూన్ రెండో తేదీకి మూడు నాలుగు రోజుల ముందు ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ముగుస్తుందని అధికారవర్గాలు సమాచారం.