నామినేషన్ల వెల్లువ
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఆఖరి రోజున నామినేషన్లు వెల్లువెత్తాయి. జెడ్పీటీసీ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలిరావడంతో జిల్లా పరిషత్ ఠ మొదటి పేజీ తరువాయి
ప్రాంగణం కిక్కిరిసింది. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ నామినేషన్ పత్రాలను పూర్తి చేస్తూ అభ్యర్థులు కనిపించారు. వైఎస్సార్‌సీపీ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి గురువారం తోట్లవల్లూరు జెడ్పీటీసీ స్థానానికి మరో నామినేషన్ దాఖలు చేశారు.
టీడీపీ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి గద్దె అనూరాధ తిరువూరు, కంకిపాడు, ఉంగుటూరు జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు అందజేశారు. ఆమె వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జెడ్పీ మాజీ చైర్మన్ నల్లగట్ల సుధారాణి, పెడన, పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జిలు కాగిత వెంకట్రావు, వర్ల రామయ్య తదితరులు ఉన్నారు.
అనూరాధ మూడు మండలాల్లోని జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయటం చర్చనీయాంశమైంది. మూడు మండలాలకు నామినేషన్లు వేసేందుకు ఉదయం 11.30 గంటల సమయంలో జెడ్పీ సమావేశపు హాలులోకి వచ్చిన గద్దె అనూరాధ టీడీపీ నాయకులతో కలిసి సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉన్నారు.
పటిష్ట బందోబస్తు
జెడ్పీటీసీ నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు కావటంతో ఏఎస్పీ బీడీవీ సాగర్ నేతృత్వంలో బందరు డీఎస్పీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థి, వారిని బలపరుస్తూ సంతకం చేసే వారిని మాత్రమే లోనికి అనుమతించారు. 49 మండలాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఐదు కౌంటర్లను ఏర్పాటు చేయగా ప్రతి కౌంటరు వద్ద పెద్ద ఎత్తున అభ్యర్థులు, వారి మద్దతుదారులు నిలబడటంతో జెడ్పీ సమావేశపు హాలు కిక్కిరిసిపోయింది.
ఒకేసారి అధిక సంఖ్యలో దరఖాస్తులు రావటంతో అధికారులు వాటిని క్రమపద్ధతిలో పెట్టడం లేదని, ముందు వచ్చిన దరఖాస్తులను ముందుగానే పిలవాలంటూ పలువురు అభ్యర్థులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జెడ్పీ సమావేశపు హాలులోకి వచ్చి అభ్యర్థులకు సర్దిచెప్పాల్సి వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ధరావతు నగదు చెల్లించిన రసీదును చూపితేనే అభ్యర్థులను, వారి మద్దతుదారులను లోపలకు అనుమతించారు. నామినేషన్లకు గడువు తక్కువ ఉండటంతో చివర్లో జెడ్పీ కార్యాలయానికి చేరుకునేందుకు కొందరు అభ్యర్థులు పరుగులుపెట్టారు. సాయంత్రం ఐదు గంటల తరువాత జెడ్పీ ప్రధాన గేటును పోలీసులు మూసివేశారు.
నువ్వెంతంటే.. నువ్వెంత..
టీడీపీ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి గద్దె అనూరాధ నామినేషన్ దాఖలు చేసేందుకు జెడ్పీ సమావేశపు హాలులోకి వెళ్లే సమయంలో ఆమెతో పాటు టీడీపీ నాయకులు దేవినేని ఉమా, కాగిత వెంకట్రావు, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జెడ్పీ మాజీ చైర్మన్ నల్లగట్ల సుధారాణి తదితరులు ఆమెతో పాటు కార్యాలయం లోనికి వెళ్లారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని, ఎక్కువ మంది వెళ్లేందుకు వీలు లేదని మచిలీపట్నం టౌన్ సీఐ బీవీ సుబ్బారావు టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు సీఐతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి నువ్వెంతంటే.. నువ్వెంత... అంటూ ఆగ్రహంతో ఇద్దరూ ఊగిపోయారు. పోలీసులు.. టీడీపీ జిల్లా కార్యదర్శి అర్జునుడు ఇరువురికి సర్దిచెప్పారు.
మాజీ చైర్‌పర్సన్..
మాజీ వైస్ చైర్‌పర్సన్ మాటామంతీ...
నామినేషన్ హాలులో అనూరాధ వెంట వచ్చిన జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, మరో సెట్ దాఖలుకు వచ్చిన తాతినేని పద్మావతి ఒకరికొకరు ఎదురయ్యారు. ఈ సందర్భంగా పరస్పరం పలకరించుకున్నారు. బాగున్నారా అంటూ సుధారాణి పలకరించి వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించినందుకు అభినందనలు తెలుపుతున్నానంటూ పద్మావతితో కరచాలనం చేశారు. ఇరువురు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్న సమయంలో వీరి కుశల ప్రశ్నలు ఆసక్తికరంగా కనిపించింది.
కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు...
కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసే వారు కరువవ్వటంతో ఆ పార్టీ నాయకుల హడావుడి అంతగా కనిపించలేదు. అభ్యర్థులను బతిమలాడి మరీ పార్టీ తరఫున నామినేషన్లు వేసేంత వరకు ఆ పార్టీ నాయకులు తెరవెనుక కథ నడిపారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు నామినేషన్ల గడువు ముగుస్తున్న సమయంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.