ఎదురు చూపుల కు 8 ఏళ్ల
మాచవరం, న్యూస్‌లైన్: పులిచింతల ముంపు గ్రామాల్లో నివశించే వారికి ప్రత్యేక ప్యాకేజీలు అమలు చేయాలి.. గ్రామం విడిచి వెళ్లే నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి.. ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మాట. చె ప్పిందే తడవుగా ప్యాకేజీల అమలుకు జీవో విడుదల చేశారు. సౌకర్యాల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ విడుదలయింది. మహానేత మరణంతో పరిహారాలు, ప్యాకేజీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిదేళ్లుగా నిర్వాసితులు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. చూసి కళ్లు కాయలు కాసాయే తప్ప నష్టపరిహారం మాత్రం పూర్తి స్థాయిలో అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వేలు.. హామీలతోనే సరి..
పులిచింతల ముంపు గ్రామాల జాబితాలో మాచవరం మండలంలోని రేగులగడ్డ, గోవిందాపురం, వెల్లంపల్లితో పాటు వేమవరం గ్రామంలోని కొంత భాగం ఉన్నాయి. వీరంతా 2006 నుంచి నష్ట పరిహారం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. మహానేత వైఎస్ రెండో సారి ముఖ్యమంత్రి కాగానే నిర్వాసితుల సౌకర్యాల కల్పనకు బడ్జెట్ కేటాయించారు. వెల్లంపల్లి, వేమవరం గ్రామాలకు పరిహారం అందగా రేగులగడ్డ, గోవిందాపురం వాసులకు కొంతమేర పరిహారం అందజేశారు. మహానేత మరణానంతరం ఇప్పటి వరకు వారికి పరిహారం దక్కలేదు. రేగులగడ్డ గ్రామంలో సుమారు 70 ఎకరాలు డీకే పొలాలకు నష్టపరిహారం రావాల్సి ఉంది. 1బీ రికార్డుల్లో, అడంగల్‌లో అనుభవదారుల పేర్లు ఉన్నప్పటికీ వారికి నష్టపరిహారం రాలేదు. ఈ పొలంలోనే సర్వే నిర్వహించి 38 ఎకరాలకు పరిహారం అందిస్తామని పులిచింతల డీటీ భాస్కరరావు, అప్పటి తహశీల్దార్ లెవి చెప్పారు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. జాయింట్ కలెక్టర్లు కూడా వచ్చి గ్రామాలను సందర్శించారు. వారం రోజుల్లో ప్యాకేజీలను అందిస్తామని, ఇంటి స్థలాలు ఇస్తామని హామీలిచ్చి వెళ్లారు. వారి మాటలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి.
అప్పుడో మాట.. ఇప్పుడో మాట.. నిర్వాసితులు కోరుకున్న చోటే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. రేగులగడ్డ నిర్వాసితులు బ్రాహ్మణపల్లిలో కావాలని కోరుకున్నారు. అప్పటి ఎస్‌డీసీ సత్యభాస్కర్ అక్కడ స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఆ తర్వాత బ్రాహ్మణపల్లి రైతులు నిర్వాసితులకు ఇచ్చే పొలంపై కోర్టుకు వెళ్లడంతో అది కాస్తా వాయిదా పడింది. ఇప్పటికీ తమకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోవిందాపురం గ్రామస్తులకు కూడా నష్టపరిహారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కాని ఫలితం మాత్రం శూన్యం. కోరుకున్న చోట తమకు స్థలం కేటాయిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడేమో ఎక్కడ ఇస్తే అక్కడకు వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసిందని నిర్వాసితులు వాపోతున్నారు. హౌసింగ్ గ్రాంట్, ఆర్ ఆర్ ప్యాకేజీలు పెండింగ్ పడుతూనే ఉన్నాయి.
నిర్వాసితులు మాత్రం అడిగిన చోటే స్థలం ఇవ్వాలని పట్టుబట్టారు. 480 పీసీపీ నంబర్లు ఉన్న వారికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్యాకేజీలు అందక ఇబ్బంది పడుతున్నారు. నల్గొండ జిల్లాలో నిర్వాసిత గ్రామాల్లోని వారికి ఇళ్లు ఇవ్వకుండానే ఆర్ ఆర్ ప్యాకేజీ అందజేశారు. గుంటూరు జిల్లాలో మాత్రం ఇంటి స్థలాలు, ఆర్‌ఆర్ ప్యాకేజీలు పూర్తి స్థాయిలో ఇప్పటికీ అందించలేదు. నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి.. ఏటి ఒడ్డునే ఉన్న మా గ్రామానికి నష్టపరిహారం అందక అవస్థలు పడుతున్నాం. అరకొర వచ్చిన పరిహారం డబ్బు కాస్తా ఖర్చయిపోయింది. ఒకేసారి పూర్తి నష్టపరిహారం అందించకుండా ఉన్న ఆస్తిపాస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. తమ గ్రామంలోని నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి.
- నాగేంద్రం నాగేశ్వరరావు, సర్పంచ్, రేగులగడ్డ
పరిహారం పూర్తిగా ఇస్తేనే వెళ్తాం.. మా గ్రామానికి ఆర్ ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలాలు, డీకే పొలాలకు నష్టపరిహారం రాలేదు. ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయం చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా మాకు ప్యాకేజీలు రాలేదు. ఇప్పుడు అధికారులేమో గ్రామం విడిచి వెళ్లిపోండి, నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తమకు పూర్తి నష్టపరిహారం ఇస్తేనే గ్రామం విడిచి వెళతాం. - సింగడాల ముక్కంటి, మాజీ ఎంపీటీసీ, రేగులగడ్డ