- ఓటర్ల జాబితాలో పెరుగుతున్న తృతీయ ప్రకృతి వ్యక్తులు
- ‘అదర్స్’గా గుర్తింపు ఇచ్చిన ఈసీ
- రాష్ట్ర ఓటర్లలో 4,422 మంది
ఎలక్షన్ సెల్: ఓటర్ల జాబితాలో తృతీయ ప్రకృతి వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో ‘సెక్సువల్ మైనారి టీలు’గా గుర్తింపు పొందిన మూడో ప్రకృతుల జనాభా 60 లక్షల దాకా ఉంటుందని అంచనా. కానీ ఓటర్ల జాబితాలో మాత్రం వారికి కొంతకాలం క్రితం దాకా ‘ప్రత్యేక’ గుర్తింపు లేదు. దాంతో వారు స్త్రీ లేదా పురుషుడిగా మాత్రమే పేరు నమోదు చేయించుకోవాల్సి వచ్చేది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా తప్పుడు లైంగికతను నమోదు చేసుకోలేక హిజ్రాలు, లింగమార్పిడి చేయించుకున్న వారు ఓటింగ్ ప్రక్రియకే దూరంగా ఉండే వారు. ఈ నేపథ్యంలో వారికి ఓటర్ల జాబితాలో ‘థర్డ్ సెక్స్’గా ప్రత్యేక గుర్తింపు కల్పిం చాలన్న డిమాండ్ 1994 నుంచే మొదలైంది. అది చివరికి 2009లో నెరవేరింది. హిజ్రాలకు, లింగ మార్పిడి చేయించుకున్న వారిని ‘అదర్స్’గా ఓటర్ల జాబితాలో ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. ప్రస్తుతం వీరి సంఖ్య రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో అత్యధికం (447)గా ఉంది. కర్నూలు జిల్లాలో 358, నల్లగొండ జిల్లాలో 63 మంది తృతీయ ప్రకృతులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నమోదైన 18-19 ఏళ్ల వయసున్న ఓటర్లలో 500 మంది తృతీయ ప్రకృతులున్నారు.
ఎన్నికల్లో ఇదో ‘గే’ల...
మైనారిటీల ఓట్లు మన దేశంలో ఎంత కీలకమో తెలిసిందే. ఎన్నికల వేళ పార్టీలన్నీ వారి ఓట్ల కోసం పాకులాడుతుంటాయి. మతపరమైన, భాషా పరమైన మైనారిటీల్లాగే లైంగికపరమైన మైనారి టీలు కూడా తాజాగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ వర్గాన్ని ‘లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్’ (ఎల్జీబీటీ)గా సంబోధి స్తున్నారు. ఐపీసీ 377 సెక్షన్ ప్రకారం స్వలింగ సంపర్కం నేరమేనంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పడం తెలిసిందే. దేశంలో దాదాపు 25 లక్షల మంది స్వలింగ సంపర్కులున్నారని ఆ కేసు విచారణ సమయంలో కేంద్రం కోర్టుకు తెలిపింది. వారి వాస్తవ సంఖ్య దాదాపు 10 కోట్ల దాకా ఉంటుందన్నది స్వచ్ఛంద సంస్థల అంచనా.
మన రాష్ట్రంలో 2014 ఓటర్ల జాబితాలో ఆడా, మగా కాని వారి సంఖ్య 4,422గా నమోదైంది. 2009 ఎన్నికలతో పోలిస్తే (2,423) ఇది దాదాపు రెట్టింపు.
సామాజిక అవహేళనకు భయపడి చాలామంది తమ లైంగికతను బయటకు చెప్పుకోలేకపోతున్నారని చెబుతుంటారు. భారత్‌తో పోలిస్తే, పాశ్చాత్య దేశాల్లో ఎల్జీబీటీ వర్గం కోసం పోరాడే సంస్థలు చాలా క్రియాశీలంగా ఉన్నాయి. అవి ప్రభుత్వ విధానాలను సైతం ప్రభావితం చేయగలుగుతున్నాయి. అమెరికాలో స్వలింగ సంపర్కుల సంఖ్య దాదాపు 3.5 కోట్ల దాకా ఉంది. దాంతో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఎల్జీబీటీ వర్గానికి ఒబామా పలు వరాలు కురిపించారు. ఆయన గెలుపులో ఈ వర్గం పాత్ర కూడా గణనీయమైనదని విలియమ్స్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. భారత్‌లోనూ వీరి సంఖ్య గణనీయంగానే ఉన్నా, సుప్రీం తీర్పు నేపథ్యంలో పార్టీలు ధైర్యంగా ముందుకొచ్చి ఎల్జీబీటీ హక్కులపై బాహాటంగా హామీలిచ్చే పరిస్థితి కన్పించడం లేదు.
విదేశాల్లో ఇలా...
బ్రిటన్‌లో 50 మంది స్వలింగ సంపర్కులు రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బంగ్లాదేశ్‌లో హిజ్రా ఓటర్ల సంఖ్య లక్షకు పైబడింది. దాంతో ఎన్నికల కమిషన్ 2001 ఎన్నికల్లో వీరి కోసం పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసింది! యూరోపియన్ యూనియన్ దేశాల్లో స్వలింగ సంపర్కం నేరం కాదు. స్వలింగ వివాహాలకు 7 ఈయూ దేశాలు చట్టబద్ధత కల్పించాయి. ఉత్తర అమెరికా, ఈయూలతో పాటు పలు లాటిన్ అమెరికన్ దేశాల్లో కూడా స్వలింగ సంపర్కానికి ప్రజామోదం ఉంది.
పశ్చిమాసియా, ఆఫ్రికా, రష్యా, ఆసియాల్లోని పలు దేశాల్లో అదే స్థాయిలో వ్యతిరేకత ఉంది.
తొలి హిజ్రా ఎమ్మెల్యే షబ్నమ్ మౌసీ
దేశంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి హిజ్రా షబ్నమ్ మౌసీనే. ఆమె మధ్యప్రదేశ్‌లోని సుహాగ్‌పూర్ నియోజకవర్గం నుంచి 1998 ఎన్నికల్లో గెలుపొందారు. అయితే అప్పట్లో వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఓటర్ల జాబితాలో తనను తాను మహిళగా నమోదు చేయించుకున్నారు!
మో‘డీ అంటే ఢీ’...
వారణాసిలో డాన్, హిజ్రాల పోటీ
మో‘డీ అంటే ఢీ’ అంటూ ఒక మాఫియా డాన్, ఒక హిజ్రా కూడా వారణాసి బరిలోకి దిగారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో వారణాసి లోక్‌సభ స్థానంలో ‘ఆప్’ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తలపడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఆరితేరిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీగా జైలులో ఉంటూనే ఖ్వామీ ఏక్తా దళ్ (క్యూఈడీ) తరఫున వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మవు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముఖ్తార్ అన్సారీ, నాలుగు పర్యాయాలుగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదివరకు బీఎస్పీలో ఉన్న ఈ మాఫియా డాన్, ప్రస్తుతం క్యూఈడీ సభ్యుడిగా యూపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోడీపై ఈ ఎన్నికల్లో గెలుపు సాధిస్తానని ఈ అసెంబ్లీ‘డాన్’ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మురళీ మనోహర్ జోషీకి గట్టి పోటీ ఇవ్వగలిగానని, కేవలం 20 వేల స్వల్ప తేడాతో గెలుపు చేజార్చుకున్నానని చెబుతున్నారు. వారణాసి నియోజకవర్గం పరిధిలోని సుమారు 2.50 లక్షల మంది ముస్లిం ఓటర్ల మద్దతు తనకే ఉంటుందని అంటున్నారు. మరోవైపు, కమలా అనే హిజ్రా కూడా వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. గోరఖ్‌పూర్‌లో ఇటీవల హిజ్రాల సంఘం నిర్వహించిన సమావేశంలో ఆమెదించిన తీర్మానం మేరకు కమలా గెలుపు కోసం వారణాసి నియోజకవర్గం పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి హిజ్రాలంతా తరలి రానున్నారు. తామంతా ములాయంసింగ్ యాదవ్‌ను తదుపరి ప్రధాని చేయాలంటూ ప్రచారం చేయనున్నామని హిజ్రాల తరఫు ప్రతినిధి సోనమ్‌సింగ్ యాదవ్ చెప్పారు. ములాయం మద్దతుదారులమని, ప్రధానిగా ఆయన మెరుగైన పాలన అందించగలరని భావిస్తున్నామని అన్నారు.