
అట్టడుగువర్గాల ఆశాజ్యోతి జనసేన
పవన్‌కల్యాణ్ పార్టీ వర్గాల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా, బలహీనవర్గాల దీర్ఘకాలిక లక్ష్యాల కోసం జనసేన విస్తృతంగా కృషి చేస్తుందని ఆ పార్టీ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా యువ రాజకీయ నాయకులతో పాటు సమాజాన్ని సంస్కరించే సైన్యాన్ని తయారు చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజలకు విస్తృత ప్రయోజనాలను అందించే సరికొత్త రాజకీయాన్ని సృష్టించేందుకు పవన్ ప్రణాళికలు తయారు చేస్తున్నారని పేర్కొంది.
స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల అవతరణ దినోత్సవాలను మాత్రమే సెలవు దినాలుగా జనసేన పరిగణిస్తుందని పేర్కొంది. జాతీయ సమగ్రత, సంస్కృతిలకు దోహదపడే రోజులను మాత్రమే పార్టీ సెలవు దినాలుగా పాటిస్తుందని వివరించింది. ప్రాథమిక పరిశీలన ద్వారా వ్యక్తిత్వాలను పరిశీలిస్తూ వేలాదిమందిని జనసేన సభ్యులుగా చేర్చుకుంటుందనీ, ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని పార్టీ ప్రకటించింది.