త్యాగానికి, ద్రోహానికి మధ్య పోరు: హరీష్‌రావు
ఎవరికి ఓటేస్తారో ప్రజలే తేల్చుకోవాలి : హరీష్‌రావు
హుజూర్‌నగర్, న్యూస్‌లైన్: ఈ ఎన్నికలు త్యాగానికి, ద్రోహానికి మధ్య జరుగుతున్నాయని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు అన్నారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానానికి పాల్పడిన శ్రీకాంతాచారిది త్యాగమైతే.. అదే ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిది ద్రోహం.. త్యాగానికి ఓటేస్తారో.. ద్రోహానికి ఓటేస్తారో హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలే తేల్చుకోవాలని కోరారు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో బుధవారం రాత్రి జరిగిన తెలంగాణ నవ నిర్మాణ సాధన మహాసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న సమయంలో ఉద్యమకారులపై కేసులు పెట్టించి, దెబ్బలు కొట్టించిన చరిత్ర ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఉందన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో 1200 మంది యువకులు ఆత్మ బలిదానాలకు పాల్పడినా.. ఒక్కరోజైనా అమరుల కుటుంబాలను పరామర్శించని కాంగ్రెస్ నాయకులు.. తామే ఏర్పాటు చేశామంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయించినట్లు గుర్తుచేశారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, డాక్టర్లు, కళాకారులు, ర చయితలు, న్యాయవాదులు, ఉద్యోగులందరికీ అవకాశాలు కల్పిస్తూ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను టీఆర్‌ఎస్ పార్టీ కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క అమరవీరుడి కుటుంబానికి కూడా సీటు కేటాయించకపోవడాన్ని చూస్తుంటే ఆ పార్టీకి అమరవీరుల కుటుంబాలపై ఏపాటి ప్రేమ ఉందో తెలిసిపోతుందన్నారు.
తెలంగాణ అమరవీరులపై ఏ మాత్రం గౌరవం ఉన్నా టీడీపీ, కాంగ్రెస్ నాయకులు తమ నామినేషన్లను ఉపసంహరించుకొని శంకరమ్మను ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని హరీష్‌రావు కోరారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు రమణాచారి మాట్లాడుతూ అమర వీరుల త్యాగాలు, కేసీఆర్ పోరాటపటిమ ఫలితంగానే తెలంగాణ ప్రజల కల సాకారమైందన్నారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ అభ్యర్థి శంకరమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తన కుమారుడు శ్రీకాంత్‌చారి ఆత్మ బలిదానానికి పాల్పడి మంటల్లో కాలుతూ జై తెలంగాణ అన్నాడే తప్ప అమ్మా, నాన్నలను తలచలేదన్నారు. తెలంగాణ అమరవీరులను కేసీఆర్ ఒక్కరే గౌరవించారని తెలిపారు.