రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరం
బొబ్బిలి, న్యూస్‌లైన్: ఈ రాష్ట్రానికి జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వం ఎంతో అవసరమని, అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్‌కు ఓటేసి దీవించాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్వీ సుజయకృష్ణ రంగారావు కోరారు. పట్టణంలోని ఐటీఐకాలనీ, మిలట్రీకాలనీ, ప్రేమనగర్ కాలనీ, పోలవానివలస గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి చోట సుజయ్‌కు జనం హారతులు పట్టి జేజేలు పలికారు. మీరు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవుతారని, తమ్ముడు ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశీర్వదించారు.
మేం ఫ్యానుకు తప్ప మరిదేనికీ ఓటు వేయమంటూ భరోసా ఇచ్చారు. ఐటీఐ కాలనీలో రెండు నెలల చిన్నారిని ఎత్తుకుని లాలించి తండ్రిలా పరిపాలన అందిస్తాననే నమ్మకాన్ని అందించారు.. చిన్నారులు సైతం కండువాలు వేసుకుని జెండాలు పట్టుకుని సుజయ్ వెంట పరుగులు తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం నిరంతరం కష్టపడింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు కలిసుండాలని జగన్ జైలులో కూడా ప్రాణాలకు తెగించి దీక్షలు చేశారన్నారు. అయినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒకటై రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశాయన్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో నిరంతరం కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ రాష్ట్రాన్ని రెండుగా చీల్చడానికి దోహదపడ్డారని అన్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్రాభివృద్ది చేయగలిగిన సత్తా ఒక్క జగన్ మోహన్‌రెడ్డికే ఉందని అన్నారు. ముందు చూపుతోపాటు పరిపాలన చేయగల సత్తా ఉన్న ఏకైక నాయకుడుగా మనకు కనిపిస్తున్నది జగనేనని అన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరాభిమానాలు చూసి ఓర్వలేక, ఓటమి భ యంతో రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పిన బీజేపీతో చంద్రబాబు జత కట్టారని అన్నారు.
ఇవన్నీ ప్రజలు గమనించి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అమలు చేయడానికి సాధ్యం కానివి, ఇంతకు ముందు ఎద్దేవా చేసిన వాటిని ఇప్పుడు ఇస్తానని హామీలు గుప్పిస్తున్నారని, దానిని ప్రజలెవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లే రన్నారు. సుజయ్ వెంట ప్రచారంలో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి కాగాన పార్వతి, బొద్దాన అప్పారావు, వాడపల్లి రజనీకాంత్, వంగపండు మహేష్, అరసాడ మురళి, చక్రధర్, లంక వాసుదేవరావు, న్యాయవాదులు చెల్లారపు సత్యనారాయణ, సాలా ఉదయ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.