ఇక ‘ప్రాదేశిక’ వంతు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రంగారెడ్డి జిల్లాలోని 33 మండలాలకు సంబంధించి ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పది లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలాల వారీగా ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ముందు మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల ఫలితాలు, ఆ తర్వాత జెడ్పీటీసీల ఫలి తాలు వెల్లడించనున్నారు. ప్రాదేశిక ఎన్నికలు ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిన జరిగాయి. దీంతో ఫలితాలు పురపాలక సంఘాల మాదిరిగా త్వరితంగా కాకుండా ఆలస్యంగా రానున్నాయి.
‘పుర’ ఫలితాల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ప్రాదేశిక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ రెట్టింపైంది. జిల్లాలో 33 జెడ్పీటీసీ స్థానాలు, 614 ఎంపీటీసీ స్థానాలకు గతనెలలో ఎన్నికలు నిర్వహించారు. రెండు విడతలుగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల తరఫున 2,623 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో జెడ్పీటీసీ స్థానాలకు 187 మంది పోటీ పడగా.. ఎంపీటీసీ స్థానాలకు 2,436 మంది బరిలో నిలిచారు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రాదేశిక ఎన్నికలు జరగడంతో స్థానిక నేతలు ప్రత్యేక ఆసక్తి కనబర్చారు. వాస్తవానికి గతనెలలోనే ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ సాధారణ ఎన్నికల్లో వీటి ప్రభావం పడుతుందని పేర్కొంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఫలితాల వెల్లడి వాయిదా పడింది.