‘నేతా’లయాలు | Political training course for MLA, MPs | Sakshi
Sakshi News home page

‘నేతా’లయాలు

Published Sat, Mar 29 2014 1:14 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

‘నేతా’లయాలు - Sakshi

‘నేతా’లయాలు

* ఎన్నికలకు సంబంధించి సమగ్ర శిక్షణ
* నాయకులకు శిక్షణ ఇచ్చేందుకు సంస్థలు

* రెండేళ్ల ఎంపీ కోర్సు, ఏడాది ఎమ్మెల్యే కోర్సు!
* మాజీ సీఈసీ శేషన్ ఆధ్వర్యంలో పుణేలో సంస్థ
* ఢిల్లీలో ఏడేళ్లుగా నడుస్తున్న పొలిటికల్ స్కూల్
* హైదరాబాద్‌లోనూ కమ్యూనికేషన్స్‌పై శిక్షణ

 
 రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారా? ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేద్దామనుకుంటున్నారా?  ఎన్నికల ప్రచారమెలా చేయాలి, ఆకట్టుకునేలా ఉపన్యాసం దంచేయడం ఎలాగ వంటి సవాలక్ష సందేహాలతో మథనపడుతున్నారా?  మరేం పర్లేదు. మీలాంటి వారికోసం నాయకత్వ శిక్షణ ఇచ్చే సంస్థలకు మన దేశంలో కొదవ లేదిప్పుడు.  ఢిల్లీతో పాటు ఫుణే, హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా అవి వెలిశాయి.
 
బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్ : నాయకత్వ శిక్షణ సంస్థలు ఏదో పైపై శిక్షణ ఇచ్చి సరిపెట్టే బాపతు కాదు. ఏకంగా డిప్లొమాలు, రెసిడెన్షియల్ కోర్సులు కూడా అందిస్తున్నాయి. పక్కా సీరియస్ టైపన్నమాట. ఎందుకంటే నాయకుడిగా ఎదగాలంటే గతంలోలా కులం, మతం, ప్రాంతం, ధన, కండ బలాలుంటే చాలదిప్పుడు. ప్రజల్లో, ముఖ్యంగా యువతలోనూ రాజకీయ చైతన్యం పెరిగింది. రాజకీయాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో నిరంతరం చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా కూడా అందుకు ప్రధాన వేదికగా నిలుస్తోంది. తమ నాయకుడెలా ఉండాలన్న దానిపై గతంతో పోలిస్తే ప్రజలకు చాలా స్పష్టత ఉంది.
 
  మరి వారిని ఆకట్టుకోవాలంటే పాత తరం పద్ధతులు పని చేయవు. తమ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని చక్కగా జనంలోకి తీసుకెళ్లే నేర్పు, సమకాలీన అంశాలపై పట్టు తదితరాలు తప్పనిసరి. ఈ అవసరాలను తీర్చడం, పరిపూర్ణమైన రాజకీయ నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా నాయకత్వ శిక్షణ సంస్థలు పని చేస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ టి.ఎన్.శేషన్ పుణేలో ఒక సంస్థను నడుపుతున్నారు. ఇక ఢిల్లీలో ఒక సంస్థయితే లోక్‌సభకు వెళ్లగోరే వారికోసం రెండేళ్ల కోర్సు, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఏడాది కోర్సు నిర్వహిస్తోంది!
 
 రాజధానిలో ఐపీఎల్
 భావి ప్రజా నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా 2006లో ఢిల్లీలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్‌షిప్ (ఐపీఎల్) సంస్థ ప్రారంభమైంది. వ్యూహ నిర్మాణం, వ్యూహాత్మక ఆలోచన వంటి పలు అంశాలపై శిక్షణ ఇస్తారు. కౌన్సిలర్ మొదలుకుని ఎంపీ ఆశావహుల దాకా అందరికీ ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఇప్పటికే రాజకీయల్లో ఉన్నవారు కూడా తమ శిక్షణతో మరింత రాటుదేలతారంటోందీ సంస్థ. మంచి ఉపన్యాసం ఇవ్వడం, రాసుకోవడంపై కూడా శిక్షణ లభిస్తుంది. కోర్సు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇటీవలే ముగి సింది. లోక్‌సభ బరిలో దిగే వారి కోసం ప్రత్యేకంగా రెండేళ్ల కోర్సుంది. 18 నెలలు తరగతి గదిలో, 6 నెలలు క్షేత్రస్థాయిలో శిక్షణ ఉంటుంది.  అదే ఎమ్మెల్యే, కౌన్సిలర్ ఆశావహులకు ఏడాది కోర్సుంది! 8 నెలలు తరగతిలో, 4 నెలల క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తారు. ఇవేగాక ఆరు నెలల ‘రాజకీయ అవగాహన’ కోర్సు, నాయకత్వ నైపుణ్యాల కోర్సు వంటివీ ఉన్నాయి.
 
 వారం రోజులుండే ఎలక్షన్ల మేనేజ్‌మెంట్ కోర్సూ ఉంది. విజయానికి అనుసరించాల్సిన పద్దతులు, వ్యూహాలు, టెక్నిక్‌లు నేర్పుతారన్నమాట! వీరందరికీ జాతీయ పార్టీల సిద్ధాంతాలతో పాటు భారత రాజ్యాంగం, స్వాతంత్య్రోద్యమం దాని ప్రాముఖ్యత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియ, న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం-ప్రాముఖ్యత, దేశం ఎదు ర్కొంటున్న సమస్యలతో పాటు ఎన్నికలు - వాటిలో పోటీ చేయడమెలా అంటూ నిర్దిష్టమైన సిలబస్‌తో కూడిన శిక్షణ ఉంటుంది. ఇక సభా వేదికపై ఎలా వ్యవహరించాలి, ఉపన్యా సం ఆసక్తిగా ఉండాలంటే ఏం చేయాలి వంటివాటిని నాయ కత్వ నైపుణ్య కోర్సులో నేర్పుతారు. ఎన్నికల నిర్వహణ శిక్షణ లోనేమో ఎన్నికల ను ఎలా ఎదుర్కోవాలి, ఏమేం సమకూర్చు కోవాలి, బహిరంగ సభల ఏర్పాట్లెలా ఉండాలి, విరాళాల సేక రణ ఎలా, ప్రవర్తనా నియమావళి తదితరాలన్నీ చెబుతారు.

 ఫీజులు
*    రెండేళ్ల ఎంపీ కోర్సుకు రూ.60 వేలు
*   ఏడాది ఎమ్మెల్యే/కౌన్సిలర్ కోర్సులకు రూ. 30 వేలు
*  రాజకీయ అవగాహన కోర్సుకు రూ.15 వేలు
*   ఎన్నికల మేనేజ్‌మెంట్ కోర్సు రూ.10 వేలు
 (అన్ని కోర్సులకూ రూ.2,000 అడ్మిషన్ ఫీజు)
 
 శేషన్ ‘స్కూలు’
 సీఈసీ పవరేమిటో దేశానికి తొలిసారిగా రుచి చూపడంతో పాటు నేతలను గడగడలాడించిన శేషన్ ఆధ్వర్యంలో పుణేలో ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ సంస్థ 2005 ఆగస్టులో 60 మంది విద్యార్థులతో మొదలైంది. డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ సోషల్ అండ్ పొలిటికల్ లీడర్‌షిప్ పేరుతో ఏడాది రెసిడెన్షియల్ కోర్సు ఆఫర్ చేస్తోంది. రానున్న తరానికి యువ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, రాజకీయ నాయకులను తయారు చేయడమే సంస్థ లక్ష్యమంటారు శేషన్. ‘‘మా స్కూల్లో రాజకీయాలు నేర్పబోం. ప్రభుత్వమెలా పనిచేస్తుందో చెప్పడమే మా ఉద్దేశం’’ అన్నారాయన. ఇది అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీ జాన్ ఎఫ్.కెనెడీ స్కూల్ మాదిరిగా ఉంటుంది. థియరీ కంటే క్షేత్రస్థాయి శిక్షణకే ప్రాధాన్యమిస్తారు. యునెస్కో సహకారం కూడా లభిస్తున్న ఈ స్కూలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎందరినో ఆకర్షిస్తోంది.
 ఫీజు: ఏడాది కోర్సుకు రూ. 2.75 లక్షలు.
 హాస్టల్ వసతికి మరో రూ.75 వేలు అదనం!

 
 హైదరాబాద్‌లో ‘మీడియా జంక్షన్’
 హైదరాబాద్‌లో కూడా ‘మీడియా జంక్షన్’ అనే సంస్థ అధికారులు, వృత్తి నిపుణులు, రాజకీయ నేతలకు భావ వ్యక్తీకరణ నైపుణ్యంపై తొమ్మిదేళ్లుగా శిక్షణ ఇస్తోంది. ముషీరాబాద్‌లో ఉన్న ఈ సంస్థలో శ్రీలంకకు చెందిన ఒక మంత్రి కూడా శిక్షణ పొందారు! గత అసెంబ్లీకి ఎన్నికైన ఒక ఎమ్మెల్యే కూడా ఇక్కడ శిక్షణ పొందారు. హైదరాబాద్ కార్పొరేషన్‌లోని 50 మంది కార్పొరేటర్లు తన వద్దే శిక్షణ పొంది ఎన్నికల్లో గెలిచారని నిర్వాహకులు అంటున్నారు. ఉపన్యాసం ఇవ్వడమెలా, ఎలా తయారు చేసుకోవాలి, వేదికపై మాట్లాడేప్పుడు వేషభాషలు, హావభావాలెలా ఉండాలి తదితర అంశాలపై వారం పాటు శిక్షణ ఇస్తారు.  శిక్షణను వీడియో తీసి అభ్యర్థులకు చూపిస్తారు కూడా. బ్యాచ్‌కు 8 మందినే తీసుకుంటారు.
 ఫీజు: వారం రోజుల కోర్సుకు రూ.7 వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement