కొడవలూరు, న్యూస్‌లైన్: ఇఫ్కోకు గ్యాస్ సరఫరా చేసేందుకు కృషి చేసి ఫ్యాక్టరీ నిర్మాణం జరిగేలా చూస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహనరెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని కొడవలూరులో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలసి ఆయన మంగళవారం పాదయాత్ర చేశారు. వేలాదిగా జనం తరలివచ్చి పాదయాత్రలో వారి వెంట నడిచారు. ప్రధాన రహదారులు సైతం జనంతో కిక్కిరిసిపోయాయి. అశేషంగా తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి కొడవలూరు ప్రధాన కూడలిలో ఎంపీ మేకపాటి మాట్లాడుతూ ఇఫ్కోకు గ్యాస్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చిందన్నారు.
లేని పక్షంలో సెజ్ ప్రాంతంలో ఇఫ్కో ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉండేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఇఫ్కోకు గ్యాస్ సరఫరా ఇచ్చే దాకా విశ్రమించబోనన్నారు. దగదర్తి వద్ద విమానాశ్రయానికి స్థలం ఎంపికైనప్పటికీ ఏర్పాటులో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక దాని ఏర్పాటుకూ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. నడికుడి, శ్రీకాళహస్తి రైల్వేలైన్ మంజూరైనప్పటికీ నిధుల విడుదల జాప్యం కారణంగా పనులు మందకొడిగా సాగుతున్నాయన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి పెద్దపీఠ వేసి ఆ పనులు వేగవంతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అనుకూలమైన జిల్లాల్లో వందల కోట్ల రూపాయల నిధుల విడుదల చేసి మన జిల్లాకు బాగా అన్యాయం చేసిందని ఆరోపించారు. నాలుగేళ్లపాటు కాంగ్రెసేతర ఎమ్మెల్యేలున్న చోట ఒక్క పని కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలు నాలుగేళ్లుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. 42 యేళ్ల ప్రాయంలోనే సోనియాగాంధీని ఎదిరించి ఢిల్లీ పీఠాన్ని కదిలించిన మహా వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని కొనియాడారు. చంద్రబాబు తొమ్మిదేళ్లలో ప్రజలకేమీ చేయకుండా ఇపుడు రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియాగా మారుస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబేనని చెప్పారు. కిలో రెండు రూపాయలు ఉన్న బియ్యాన్ని రూ.5.25 చేసిన వ్యక్తి కూడా బాబేనన్నారు.
సామాన్యులను విస్మరించి పాలించిన బాబు ఇపుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వస్తున్నారని ప్రశ్నించారు. 150 అసెంబ్లీ స్థానాలు సాధించి రాష్ట్రంలోనూ, తగినన్ని ఎంపీ స్థానాలు సాధించి కేంద్రంలోనూ జగన్‌మోహన్‌రెడ్డి కీలక భూమిక పోషించనున్నారని తెలిపారు. త్వరలోనే ప్రజాపాలన రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కోవూరు నియోజకవర్గంపై పక్షపాతం చూపిందన్నారు.
ఆ పార్టీ అభ్యర్థి ఓడారన్న అక్కసుతో నియోజకవర్గానికి పైసా నిధులు ఇవ్వలేదని తెలిపారు. నియోజకవర్గంలో నాలుగేళ్లలో ఆశించిన అభివృద్ధి జరగకపోవడానికి కాంగ్రెస్ పాలకులే కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్‌రెడ్డి తనయుడు రజత్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు వీరి చలపతిరావు, నల్లావుల శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, నాయకులు నాపా వెంకటేశ్వర్లునాయుడు, పిట్టి సూర్యనారాయణ, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒట్టూరు సునీత, తిరుపతమ్మ, నీలకంఠం శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకటాద్రి, నాగిరెడ్డి రమేష్ పాల్గొన్నారు.
ఇఫ్కో తెస్తాం
Published Wed, Apr 30 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM
Advertisement
Advertisement