
కళంకిత నేతల తరఫున రాందేవ్ ప్రచారం
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ అల్లర్లలో నిందితులుగా ఉన్న బీజేపీ నాయకుల తరఫున యోగా గురువు రాందేవ్ బాబా ప్రచారం చేస్తున్నారు. ముజఫర్నగర్ నుంచి పోటీ చేస్తున్న సంజీవ్ బలియాన్, బిజ్నోర్ నుంచి పోటీ చేస్తున్న భరతేందు సింగ్ ఇద్దరి తరఫున ఆయన ప్రచారం చేశారు. అవినీతికి ఏమాత్రం తావులేని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, అలాగే స్విస్ బ్యాంకులలో ఉన్న భారతీయుల నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని కూడా చెప్పిందని ఆయన ఈ అభ్యర్థులిద్దరినీ తలోపక్క కూర్చోబెట్టుకుని విలేకరుల సమావేశంలో చెప్పారు.
బలియాన్, భరతేందు సింగ్ ఇద్దరూ ముజఫర్నగర్ అల్లర్ల కేసులో బెయిల్ మీద విడుదలై ఇప్పుడు లోక్సభకు వెళ్లేందుకు పోటీ పడుతున్నారు. ఇదే కేసులో పేరున్న మరో నిందితుడు హుకుమ్ సింగ్ కూడా కైరానా లోక్సభ స్థానానికి బీజేపీ తరఫునే పోటీ చేస్తున్నారు. హుకుమ్ సింగ్, సంజీవ్ బలియాన్ ఇద్దరిపైనా రెండేసి కేసులు ఉన్నట్లు వారి నామినేషన్ల అపిడవిట్లలోనే ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ముజఫర్నగర్లో జరిగిన అల్లర్లలో 67 మంది మరణించారు. 85 మంది గాయపడగా, 51వేల మంది నిరాశ్రయులయ్యారు.