మో‘ఢీ’కి కేజ్రీవాల్ రెడీ
ప్రజలు కోరుకుంటే వారణాసి నుంచి పోటీకి సిద్ధం
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్య
23న వారణాసిలో సభ నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడి
సాక్షి, బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గ ప్రజలు కోరుకుంటే అక్కడి నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీకి సిద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మోడీపై పోటీ చేయాలని తన పార్టీ కోరుకుంటోందని...ఈ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. రెండు రోజుల కర్ణాటక పర్యటన ముగింపు సందర్భంగా ఆదివారం బెంగళూరులోని దొడ్డబళ్లాపుర, యలహంక, చిక్కబళ్లాపుర ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించిన కేజ్రీవాల్ అనంతరం బెంగళూరులోని ఫ్రీడం పార్కులో నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘‘ఈ పోటీని ఈరోజే అంగీకరించట్లేదు. ఈ నెల 23న వారణాసిలో సభ నిర్వహిస్తున్నాం. అక్కడి ప్రజలు ఏం చెబితే అదే అంతిమం. దానిపై అప్పుడే తుది నిర్ణయం తీసుకుంటా. ఒకవేళ వారు నాకు ఈ బాధ్యత (మోడీపై పోటీ) అప్పగించాలని నిర్ణయిస్తే దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తా’’ అని పార్టీ హర్షధ్వానాల మధ్య కేజ్రీవాల్ ప్రకటించారు. తనకు ఇదో పెద్ద సవాల్ అని తెలుసన్నారు. రాజకీయాల్లోకి తాము అధికారం లేదా డబ్బు సంపాదించేందుకు రాలేదని, దేశం కోసం జీవితాలను త్యాగం చేసేందుకు వచ్చామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే
దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిన బ్రిటిష్ వాళ్లు దోచుకున్న సంపద కంటే పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన యూపీఏ ప్రభుత్వం దోచుకున్న సంపదే ఎక్కువని దుయ్యబట్టారు. రిలయన్స్‌కు అడ్డగోలుగా గ్యాస్ కేటాయింపులు జరిపిన మొయిలీ.. అడవిదొంగ వీరప్పన్ కంటే ఎక్కువగా సొమ్ము వెనకేసుకు న్నారని ఆరోపించారు. గుజరాత్‌లో అవినీతి కనిపించదన్న మోడీ మాటల్లో నిజంలేదని... గుజరాత్‌లో బదిలీలు, పదోన్నతులు సహా వివిధ పనులకు ఒక్కో రేటు ఫిక్స్ చేశారని, అవినీతిలో కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలన్నారు.
మోడీ ప్రధాని అయితే అంతే: అవినీతి ఆరోపణలతో బీజేపీ నుంచి బయ టకు వెళ్లిన యడ్యూరప్పను ఆ పార్టీ తిరిగి చేర్చుకోవడాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టారు. మోడీ ప్రధాని అయితే యడ్యూరప్పను టెలికం మంత్రిగా నియమిస్తారని ఎద్దేవా చేశారు. అలాగే అక్రమ మైనింగ్ కేసులో జైలుపాలైన గాలి జనార్దన్‌రెడ్డికి సన్నిహితుడైన శ్రీరాములు సైతం బీజేపీని వీడినా ఆయన్ను కూడా తిరిగి పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. మోడీ ప్రధాని పగ్గాలు చేపడితే శ్రీరాములుకు మైనింగ్ శాఖ కట్టబెట్టడంతోపాటు గుజరాత్‌లో ఓ మహిళపై గూఢచర్యానికి ఆదేశాలిచ్చిన ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి అమిత్‌షాను కేంద్ర హోంమంత్రిగా నియమిస్తారని చురకలంటించారు.