టీఆర్‌ఎస్ వసూళ్ల పార్టీ
మహబూబ్‌నగర్ ప్రజా గర్జనలో చంద్రబాబు ధ్వజం
మహబూబ్‌నగర్: టీడీపీ జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టేది లేదని, బుల్లెట్‌లా దూసుకొచ్చి అడ్డొచ్చిన వారిని తొక్కేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి పార్టీలను హెచ్చరించారు. ‘ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజన చేసినందుకు బాధపడటం లేదు. ఒక పార్టీ అధ్యక్షుడిగా తెలుగు వారికి న్యాయం చేయాలని అడిగాను. రాష్ట్ర విభజనకు టీడీపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేఖ ఇచ్చాం. తెలంగాణలో టీడీపీని ఖాళీ చేస్తామని కొందరంటున్నారు. పార్టీ జోలికొస్తే వదిలి పెట్టేది లేదు.
సైకిల్‌పై బుల్లెట్‌లా దూసుకొచ్చి.. అడ్డమొస్తే తొక్కేస్తాం’ అని ఆయన తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. మహ బూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో మంగళవారం జరిగిన ‘ప్రజా గర్జన’లో చంద్రబాబు ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘సామాజిక, నవ, బంగారు తెలంగాణ సాధించడం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వల్ల కాదు. బీసీలకు ముఖ్యమంత్రి అనే రామబాణం వదిలాం. దీనికి దీటైన బాణం ఏ పార్టీ వద్దా లేదు. ఎన్నికల నాటికి ఈ నినాదం ప్రభంజనంలా మారుతుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 1995లో జీతాలివ్వలేని పరిస్థితి నుంచి తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉండేలా కృషి చేసింది తమ పార్టీనేనని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణ వచ్చినంత మాత్రాన అన్ని సమస్యలు పరిష్కారం కావు. కేసీఆర్ క్రమశిక్షణ లేని వ్యక్తి. సంపదను భోంచేయడానికి ఆవురావురుమని ఉన్నాడు. తెలంగాణలో సమస్యల పరిష్కారం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల వల్ల సాధ్యం కాదు. కాంగ్రెస్‌కు నాయకత్వం లేదు. పద్ధతి, క్రమశిక్షణ లేదు’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.
సుపరిపాలన టీఆర్‌ఎస్‌తో రాదు
‘టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లే. తెలంగాణ వచ్చిన వెంటనే సోనియాతో కేసీఆర్ కుటుంబ సమేతంగా ఫొటో దిగాడు. ఒంటెలు, గుర్రాలపై ఊరేగాడు. ఆ తర్వాత మాట మార్చి కాంగ్రెస్‌పై మండిపడ్డాడు. కేసీఆర్‌కు పరిపాలన తెలియదు. టీఆర్‌ఎస్ వసూళ్ల పార్టీ. కాంగ్రెస్ అసమర ్థ పార్టీ’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘అమర వీరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత టీడీపీది. అమరుల కుటుంబాలకు నష్టపరిహారం, ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటాం’ అని చంద్రబాబు ప్రకటించారు. ‘జై తెలంగాణ’, ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలతో తెలుగుదేశం పార్టీ ఇరు ప్రాంతాల్లో ప్రజల్లోకి వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రత్యేక అతిథిగా పాల్గొన్న మహబూబ్‌నగర్ ప్రజా గర్జన సభలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కె.దయాకర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
దేశంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే
చంద్రబాబు సమక్షంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్రహం టీడీపీలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు పరిషత్ ఎన్నికలకు బీ-ఫారాల విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ప్రాధాన్యతనివ్వలేదని అబ్రహం అగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యమని భావించి ఆ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపార.