బియ్యం పథకానికి ఆద్యుడు | Rice subsidy scheme introduced by Natarajan Annadurai | Sakshi
Sakshi News home page

బియ్యం పథకానికి ఆద్యుడు

Published Wed, Apr 2 2014 1:38 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

బియ్యం పథకానికి ఆద్యుడు - Sakshi

బియ్యం పథకానికి ఆద్యుడు

ద్రవిడులకు పూజ్యుడు.. నటరాజన్ అన్నాదురై
నిరుపేదలు ఆకలితో అలమటించరాదనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా అన్నాదురై ప్రభుత్వం సబ్సిడీ బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. అట్టడుగు వర్గాల పిల్లలు చదువుకునేందుకు ఎస్సీ, బీసీ హాస్టళ్లను ప్రారంభించింది. హేతువాద విధానాన్ని అవలంబించి, ప్రభుత్వ కార్యాలయాల్లో దేవుళ్ల బొమ్మలను తీసివేయాలని ఆదేశించింది. అప్పటి వరకు ఉన్న మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చింది.
 
సీవీఎస్ రమణారావు: ద్రవిడ ఉద్యమ రథసారథి కంజీవరం నటరాజన్ అన్నాదురై తమిళనాడులో నాలుగు దశాబ్దాల కిందట వేసిన కాంగ్రెస్ వ్యతిరేక పునాదులు నేటికీ చెక్కుచెదరలేదు. స్వాతంత్య్రానంతరం పూర్తిస్థాయి మెజారిటీతో అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా అన్నాదురై చరిత్ర సృష్టించారు. బహుముఖప్రజ్ఞశాలి అయిన అన్నాదురై ఉపాధ్యాయుడిగా, పాత్రికేయుడిగా, రచయితగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా తమిళ ప్రజలపై చెరగని ముద్ర వేశారు. జనాకర్షక పథకాలతో పేదల పెన్నిధిగా గుర్తింపు పొందారు. ఆయన స్థాపించిన డీఎంకే గానీ, ఆయన పేరిట ఏర్పడిన అన్నా డీఎంకే గానీ ఒకటి ఓడితే మరొకటి అన్నట్లుగా నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తున్నాయి.
 
 కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు జాతీయ పార్టీలే అయినా, ద్రవిడ పార్టీల మద్దతు లేకుండా తమిళనాడులో ఒక్క సీటైనా గెలవడం వాటికి అసాధ్యం. ద్రవిడ పార్టీలకు తమిళనాట ఇంతటి ప్రజాదరణకు నాంది పలికిన నేత అన్నాదురైని అభిమానులు, అనుచరులు ఆప్యాయంగా ‘అణ్ణా’ (అన్నా) అని పిలుచుకునేవారు. దేశవ్యాప్తంగా త్రిభాషా సూత్రం ప్రకారం విద్యార్థులంతా తమ మాతృభాష, ఇంగ్లీషు, హిందీలను నేర్చుకోవడం తప్పనిసరి. తమిళనాడులో మాత్రం అన్నాదురై నాయకత్వంలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం ఫలితంగా 1965లో ద్విభాషా సూత్రం (తమిళం, ఇంగ్లీషు) అమలులోకి వచ్చింది. కేంద్రంతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలేవైనా ఇప్పటికీ ఈ రెండు భాషల్లోనే ఉంటాయి. రైల్వేస్టేషన్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై కూడా హిందీ నిషిద్ధం.
 
జస్టిస్ పార్టీతో అనుబంధం...
 తమిళనాడుపై చెరగని ముద్రవేసిన అన్నాదురై 1909 సెప్టెంబర్ 15న చేనేత కుటుంబంలో కంజీవరం నటరాజన్, బంగారు అమ్మాళ్ దంపతులకు జన్మించారు. కంజీవరంలో పాఠశాల విద్య, మద్రాసు పచ్చయప్ప కాలేజీ నుంచి బీఏ (ఆనర్స్), ఎంఏ డిగ్రీలు పూర్తి చేశారు. పచ్చయ్యప్ప కాలేజీ నడిపే హైస్కూలులో ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించారు. బ్రిటిష్ హయాంలో నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉండేది. దానికి వ్యతిరేకంగా బ్రాహ్మణేతరులంతా ఏకమై 1917లో జస్టిస్ పార్టీ స్థాపించారు. జస్టిస్ పార్టీ 1920 నుంచి 1937 వరకు అధికారంలో కొనసాగింది. జస్టిస్ పార్టీ అధికార పత్రికలో అన్నాదురై 1938లో సబ్ ఎడిటర్‌గా చేరారు.
 
గురువుతో విభేదాలు   
 అన్నాదురై సైద్ధాంతిక గురువు ఈవీ రామస్వామి నాయకర్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ 1944లో పార్టీని ‘ద్రవిడ కజగం’గా(డీకే) పేరు మార్చారు. సాంఘికోద్యమ సంస్థగా డీకే ఎన్నికల్లో పాల్గొనరాదని, సామాజిక పోరాటాలకే పరిమితం కావాలని ఆయన భావించారు. ఈ విధానంతో విభేదించిన అన్నాదురై 1948లో డీకే నుంచి వేరుపడి, రామస్వామి అన్న కొడుకు ఈవీకె సంపత్ మద్దతుతో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) స్థాపించారు. 1967 ఎన్నికల్లో దేశమంతటా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచాయి. తమిళనాడులోనూ కాంగ్రెస్ వ్యతిరేకత ఫలితంగా 1967లో డీఎంకే ఘనవిజయం సాధించి, అన్నా దురై ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
 
 ‘ద్రవిడనాడు’ డిమాండ్...
 ద్రవిడ సంస్కృతీ సంప్రదాయాలు వేరు కాబట్టి ప్రత్యేక దేశంగా ‘ద్రవిడనాడు’ను ఏర్పరచాలనేది డీఎంకేకి పూర్వరూపమైన డీకే మౌలిక డిమాండ్. అదే డిమాండ్‌తో ఉద్యమాన్ని ఎల్లకాలం కొనసాగించలేమని, డిమాండ్ సాధన దిశగా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని, ప్రజావాణిని వినిపించాలనేది అన్నాదురై భావన. కరుడుగట్టిన ద్రవిడవాదులు అన్నాతో ఏకీభవించలేదు. 1957 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే తరఫున ఇద్దరు ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా గెలుపొందారు. 1962 నాటికి డీఎంకే తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీగా ఎదిగింది. ఆ ఎన్నికల్లో డీఎంకే 50 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కానీ అన్నా తన స్వస్థలమైన కాంచీపురంలో ఓడారు. దీంతో ఆయన్ను పార్టీ రాజ్యసభకు పంపింది.
 
 నేటికీ అన్నా వారసులే ...
 ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రెండేళ్లకే అన్నా గొంతు కేన్సర్ బారినపడ్డారు. విపరీతంగా నశ్యం పీల్చే అలవాటు కారణంగానే ఆయనకు కేన్సర్ సోకినట్లు అమెరికాలో ఆయనకు చికిత్స చేసిన వైద్యులు నిర్ధారించారు. సీఎం పదవిలో ఉండగానే 1969 ఫిబ్రవరి 3న అన్నా కన్నుమూశారు. కోటిన్నర మంది ప్రజలతో సాగిన ఆయన అంతిమయాత్ర గిన్నిస్ రికార్డుకెక్కింది. ప్రపంచంలో ఏ నాయకునికీ జనం ఇంతటి స్థాయిలో అంతిమ వీడ్కోలు పలకలేదని విశ్లేషకులు తేల్చారు. అన్నా రాజకీయ వారసునిగా  తెరపైకి వచ్చిన కరుణానిధి ఆరుసార్లు సీఎంగా పనిచేశారు. మరో వారసుడు, సీనీ హీరో ఎంజీ రామచంద్రన్ రెండుసార్లు సీఎం కాగలిగారు.
 
 ‘నరేంద్ర మోడీ గొప్ప మాటకారేం కాదు. ఈ విషయం ఆయన ప్రసంగం వింటే మీకే అర్థమవుతుంది. ప్రజలు మోడీ సభలకు వెళ్తోంది ఆయనకు మద్దతు తెలపడానికే కానీ.. ఆయన ప్రసంగం వినడానికి కాదు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మంచి వక్త. భారత రాజకీయాల్లో ఆయనంత అద్భుతమైన వక్త మరొకరు లేరని ప్రజలు చెప్పుకుంటుంటారు’
 - బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి
 
 బీజేపీ ఒక్కరికి.. కాంగ్రెస్ ఇద్దరికి..!
 మహిళలకు సమానావకాశాలు అంటూ గొంతు చించుకునే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వారికెన్ని అవకాశాలిస్తున్నారో చూడండి. క ర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉంటే.. బీజేపీ కేవలం ఒకే ఒక్క మహిళకు అవకాశమిచ్చింది. ఉడుపి-చిక్‌మగళూర్ నుంచి యడ్యూరప్ప సన్నిహితురాలైన మాజీ మంత్రి శోభా కరాంద్లజెను బరిలో నిలిపింది. కాంగ్రెస్  ఇద్దరు మహిళలకు టిక్కెట్లిచ్చింది. వారిలో ఒకరు కన్నడ సినీనటి రమ్య(మాండ్య). మరొకరు లక్ష్మి హెబ్బాల్కర్ (బెల్గాం). జేడీఎస్, ఆప్‌లు ముగ్గురేసి మహిళలను పోటీలో నిలిపాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement