
చెరుకు సుధాకర్
ఉద్యమకారులను టిఆర్ఎస్లోకి చేర్చుకోకుండా కొత్తవారికి సీట్లు కేటాయించడం అన్యాయం అని ఆ పార్టీ పోలిట్బ్యూరో సభ్యుడు, నల్గొండ జిల్లా నేత చెరుకు సుధాకర్ అన్నారు.
హైదరాబాద్: ఉద్యమకారులను టిఆర్ఎస్లోకి చేర్చుకోకుండా కొత్తవారికి సీట్లు కేటాయించడం అన్యాయం అని ఆ పార్టీ పోలిట్బ్యూరో సభ్యుడు, నల్గొండ జిల్లా నేత చెరుకు సుధాకర్ అన్నారు. తాను టీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి వెళ్లాలనుకోవడంలేదని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తాను వ్యక్తిగత హోదాలోనే కలిశానన్నారు. తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీలను, వ్యక్తులను ఇక ముందు కలవనని సుధాకర్ చెప్పారు.
సుధాకర్ శనివారం రాత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. దాంతో ఆయన టిడిపిలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. పక్కా తెలంగాణవాది అయిన సుధాకర్ గతంలో వామపక్ష ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరారు. టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు వ్యవహార శైలి కొంతకాలంగా ఆయనకు నచ్చడంలేదు. ఇప్పుడు కూడా టిఆర్ఎస్లో కొత్తగా చేరినవారికి సీట్లు కేటాయించడం పట్ల సుధాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.