పరాయి సీటుకు పారార్
హైదరాబాద్ : రాష్ట్ర విభజన, వైఎస్సార్ మరణం అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. తమ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సొంతంగా సర్వేలు చేయించుకున్న కాంగ్రెస్ నేతలకు చేదు ఫలితాలే వచ్చాయి. దీంతో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో పరాభవం తప్పకపోవచ్చని అంచనాకు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు.. కనీసం గౌరవప్రదమైన ఓట్లతో బయటపడేందుకు సురక్షిత స్థానాల వేటలో పడ్డారు.
తమ జిల్లాల్లో ఇలాంటి నియోజకవర్గాలు ఏమేం ఉన్నాయి, అక్కడ పోటీచేస్తే తమకు ఎన్ని ఓట్లు వస్తాయో సర్వేలు చేయించారు. వాటిలో మంచిదని భావిస్తున్న నియోజకవర్గాలను ముందుగానే రిజర్వు చేసుకుంటున్నారు. ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నుంచి సీనియర్ నేతల్లో అత్యధికులు ఇదే బాటపడుతున్నారు. కొత్త నియోజకవర్గంలో వ్యతిరేకత అంతగా ఉండదని, కొత్త ముఖాలు కనుక ఎంతోకొంత సానుకూలత ఉంటుందనే అభిప్రాయంతో వారు ఉన్నట్టు తెలుస్తోంది.
రఘువీరారెడ్డి ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కల్యాణదుర్గానికి గుడ్‌బై చెప్పి, పెనుకొండ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం పెనుకొండలో కొంతకాలం క్రితం నుంచే రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. రఘువీరారెడ్డి గతంలో మడకశిరనుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పునర్విభజనలో ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ అవడంతో 2009లో పక్కనే ఉన్న కల్యాణదుర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.
2009లో పెనుకొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన టీకే శ్రీధర్ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి చేతిలో ఓడిపోయారు. శ్రీధర్ ఇప్పుడు పార్టీలో లేకపోవడంతో రఘువీరా పెనుకొండపై దృష్టి సారించారని సమాచారం. అక్కడ ఈసారి కూడా టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి పోటీలో ఉండటంతో ఆయనపై ప్రజల్లో ఉండే వ్యతిరేకత తనకు కొంతమేర కలసి వస్తుందనే అభిప్రాయంతో రఘువీరా ఉన్నట్లు చెబుతున్నారు.
చీపురుపల్లి ఎమ్మెల్యే, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లా మొత్తంలో ఆయన కుటుంబంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం, ఆయన వాళ్లనుకున్న నాయకులు, కార్యకర్తలు కూడా దూరమవడంతో బొత్స ఈసారి ఎక్కడి నుంచి పోటీచేయాలో కూడా నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారు. బొత్స ఈసారి విజయనగరం నుంచి లోక్‌సభకు పోటీ చేసి, భార్య ఝాన్సీని అసెంబ్లీ బరిలోకి దింపవచ్చని వార్తలు వచ్చాయి.
అయితే, ఇది మరింత ఇబ్బంది అవుతుందన్న అంచనాతో, సిట్టింగ్ ఎంపీగా ఝాన్సీనే లోక్‌సభ బరిలో నిలుపుతున్నారు. నెల్లిమర్ల, గజపతినగరంలలో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని బొత్స భావించినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. గజపతినగరంలో ఆయన సోదరుడు అప్పలనర్సయ్య, నెల్లిమర్లలో మేనల్లుడు బడ్డుకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
అక్కడా వ్యతిరేకత తప్పదేమోనన్న భయం బొత్సను వెన్నాడుతోంది. దీంతో పక్కనే ఉన్న ఎస్.కోటపై కూడా ఆయన దృష్టి పెడుతున్నట్లు సమాచారం. అయితే, అది విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో లేనందున, ఝాన్సీకి కలసిరాదేమోనన్న అభిప్రాయంతో ఉన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఉన్నా, అది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన పోటీచేసే సీటుపై తీవ్ర తర్జనభర్జన పడుతున్నారు.
మరో సీనియర్‌నేత ఆనం రామనారాయణరెడ్డి 2004లో రాపూరులో, 2009లో ఆత్మకూరులో గెలిచారు. ఇప్పుడక్కడ ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉండ డంతో మరో ప్రాంతం నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. పైగా, నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్తెసరు ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. దీంతో రామనారాయణరెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి టీడీపీలోకి వెళ్లిపోవడంతో అక్కడ ఖాళీ ఉంది. దీంతో ఆనం ఆ స్థానంపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.
జైసమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాధ్ ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉండటంతో తిరిగి కాంగ్రెస్‌లోకి రప్పిస్తున్నారు. అయితే, శైలజానాధ్ సిట్టింగ్ స్థానమైన సింగనమల నుంచి పోటీకి విముఖతతో ఉన్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మడకశిర నుంచి పోటీచేయాలని ఆయన భావిస్తున్నారు. ఆ నియోజకవర్గానికి ప్రస్తుతం కాంగ్రెస్ నేత కె.సుధాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుధాకర్‌ను మార్చి మడకశిర టికెట్ తనకు ఇప్పించాలని శైలజానాధ్ కోరినట్లు సమాచారం.
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఈసారి గుంటూరు జిల్లా తాడికొండ నుంచి పోటీచేయబోనని ఇంతకు ముందే ప్రకటించారు. తాడికొండలో ఎంపీ రాయపాటి సాంబశివరావు వర్గీయుల ప్రాబల్యం ఎక్కువ. రాయపాటి టీడీపీలో చేరడంతో, డొక్కా ఆ నియోజకవర్గానికి స్వస్తిపలికారు.
ఈసారి అదే జిల్లాలోని వేమూరు ఎస్సీ రిజర్వ్‌డు స్థానాన్ని కోరుతున్నారు. వేమూరులో గతంలో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మేరుగ నాగార్జున వైఎస్సార్ సీపీలోకి వెళ్లడంతో అక్కడ కాంగ్రెస్‌కు అభ్యర్థులు కూడా లేరు. దీంతో డొక్కా వేమూరుపై దృష్టి సారించారు. మరికొందరు సీనియర్లు కూడా కొద్దోగొప్పో ఓట్లొచ్చే స్థానాల కోసం వెదుకుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.