ఆశావహుల్లో ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ అభ్యర్థిత్వాల కసరత్తు ప్రారంభం కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. శని వారం ఢిల్లీలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమవడంతో టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) ప్రతిపాదించిన జాబితా పీసీసీ ఎన్నికల కమిటీకి వెళ్లింది.
మరోవైపు టిక్కెట్ల కోసం కొందరు నాయకులు నేరుగా పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా బోథ్, ఆదిలాబాద్ వంటి నియోజకవర్గాలకు నాయకులు నేరుగా పీసీసీ అధ్యక్షుడిని కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. డీసీసీ నుంచి పంపిన జాబితాతోపాటు, తెలంగాణ పీసీసీ రూపొందించిన మరో జాబితాలోని పేర్లను ఈ స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తోంది. రాహుల్‌గాంధీ నిర్వహించిన సర్వేలు, పలు ప్రత్యేక సర్వేల ద్వారా తేలిన గెలుపు గుర్రాల పేర్లను కూడా ఈ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుందని కాంగ్రెస్ ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు.
అభ్యర్థిత్వాల ఎంపికలో ఒక్క డీసీసీ ప్రతిపాదిత జాబితానే పరిగణలోకి తీసుకోమని, అన్ని అంశాలను పరిశీలిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటించిన విషయం విధితమే. అన్ని కోణాల్లో పరిశీలించాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ అయ్యే వరకు ఏకాభిప్రాయం లేని స్థానాలపై ప్రకటన చేసే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్దగా అభ్యంతరాలు లేని ఒకటీ రెండు సిట్టింగ్ స్థానాల నుంచి అభర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి.
ఢిల్లీకి పయనమైన జిల్లా నాయకులు
టిక్కెట్ల కేటాయింపు కసరత్తు ముమ్మరం కావడంతో జిల్లా నాయకులు ఢిల్లీ పయనమవుతున్నారు. ఎవరికి వారే తమ నేతలతో కలిసి హస్తినకు వెళ్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న నరేష్ జాదవ్ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ప్రేంసాగర్‌రావు వర్గం నేతలు కొందరు ఆదివారం ఉదయం బయలుదేరి వెళ్తున్నట్లు సమాచారం. ఎవరికి వారే టిక్కెట్ల ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు టిక్కెట్లు ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ రేపుతోంది.
డీసీసీ ప్రతిపాదిత జాబితా ఇదే?
జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదిత జాబితాను ఇప్పటికే తెలంగాణ పీసీసీకి అందజేసిన విషయం విధితమే. విశ్వసనీయ సమాచారం మేరకు నియోజకవర్గాలవారీగా ఈ జాబితాలో ఉన్న పేర్లను పరిశీలిస్తే..