అమేథీలో బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సోనియా గాంధీ
అమేథీ: కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసున్న పార్టీలే అవినీతి రొంపిలో పీకల్లోతుకు కూరుకుపోయాయని, అలాంటి పార్టీలు అవినీతి గురించి మాట్లాడటం ఏమిటని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి, కుంభకోణాలపైనా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైనా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని సవాల్ విసిరారు. కుమారుడు రాహుల్‌గాంధీ తనఫున సోనియాగాంధీ శనివారం అమేథీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ గాంధీల కర్మభూమి కోసం రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో అహర్నిశలు కష్టించి పనిచేస్తున్నారని చెప్పారు. అందుకే అమేథీ ప్రజలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీలపై ప్రేమ, వాత్సల్యం చూపుతున్నారని తెలిపారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీని ప్రజలకు అప్పగించిన మాదిరిగానే తాను 2004లో రాహుల్‌గాంధీని అమేథీ ప్రజలకు అందించానని ఆమె ఉద్వేగంగా చెప్పారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా అమేథీలోని దేవాలయంలో సోనియా గాంధీ పూజలు చేశారు. ఆ తరువాత ఓటర్లను కలిశారు. రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని కోరారు.