రాహుల్పై పోటీతో స్మృతికి అదృష్టం పట్టనుందా?
టీవీ నటి, బిజెపి ఉపాధ్యక్షురాలు స్మృతి ఇరానీకి ఒక్కసారిగా పార్టీలో ప్రధాన్యత పెరిగిపోయింది. సుష్మా స్వరాజ్ స్థాయికి ఎదిగిపోయే అవకాశం ఆమెకు వచ్చింది. 1999లో కర్ణాటకలోని బళ్లారి లోక్సభ స్థానం నుంచి సోనియా గాంధీపై సుష్మాస్వరాజ్ పోటీ చేశారు. ఆ ఎన్నికలలో సోనియాను ఢీకొనడం ద్వారా ఆమె పాపులారిటీ భాగా పెరిగింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో సిట్టింగ్ ఎంపి, ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని బిజెపి తరపున స్మృతి ఇరానీ ఢీకొనబోతున్నారు. ప్రస్తుతానికి ఈ టీవీ 'బహురాణి' స్మృతి ఇరానీ రాహుల్‌పై పోటీ చేయడం ఒక్కటే పెద్ద న్యూస్ కాదు. తెర వెనుక మరిన్ని బ్రేకింగ్స్ ఉన్నట్లు సమాచారం. సుష్మ స్థాయికి స్మృతిని తీసుకు రావాలన్న ఆలోచనలో కొంతమంది బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మరో సుష్మా అంటూ ప్రచారం మొదలైంది.
అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన స్మృతి ఇరానీ 'క్యోం కీ సాస్ బీ కబీ బహూ థీ' సీరియల్‌తో దేశ ప్రజలందరికీ చేరువయ్యారు. బీజేపీలో మాత్రం చాలా అనుహ్యంగా ఎదిగారు. గోద్రా అల్లర్లకు క్షమాపణ చెప్పకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని 2004లో నరేంద్ర మోడీని ఆమె హెచ్చరించారు. అప్పట్లో ఆమె బీజేపీ అగ్రనేత ప్రమోద్ మహాజన్ క్యాంప్‌లో ఉండేవారు. కాని 10 ఏళ్లలో సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు మోడీ కోటరీలో స్మృతి కీలక వ్యక్తిగా మారిపోయారు. గుజరాతీ భాషను అనర్గళంగా మాట్లాడటం ఆమెకు బాగా కలిసి వచ్చింది. మోడీయే ఆమెను గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. బెంగాలీ, మరాఠీ, ఇంగ్లీష్, హిందీ భాషలు కూడా ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. దానికి తోడు మంచి మాటకారి కావడంతో ఆమెకు అవకాశాలు వాటంతట అవే వస్తున్నాయి. 2004 ఎన్నికల్లో ఢిల్లీలోని చారిత్మాత్రక చాందీనీ చౌక్ లోక్సభ నియోజకవర్గంలో కపిల్ సిబల్‌కు గట్టి పోటీ ఇచ్చారు. వీటన్నిటినీ దృష్టిలోపెట్టుకునే బిజెపి ఆమెను రాహుల్‌పై నిలబెట్టింది.
రాహుల్- స్మృతి మధ్య పోటీ ఆనాటి సోనియా- సుష్మా పోటీని గుర్తుకు తెస్తోంది. బళ్లారి ఎన్నికలు సుష్మకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. ఆ ఎన్నికల్లో సుష్మ ఓడిపోయినా అక్కడ బిజెపి బలపడింది. ఆ తరువాత ఆ పార్టీ బాగా లాభపడింది. ఓటమి ఎరగని బళ్లారిలో 2004, 2009 ఎన్నికలలో కాంగ్రెస్ వరుసగా పరాజయం పాలైంది. అప్పుడు సుష్మాస్వరాజ్కు పట్టిన అదృష్టంమే ఇప్పుడు స్మృతీకి పట్టే అవకాశం ఉందని బీజేపీలో పలువురు భావిస్తున్నారు. అమేథీ ఎన్నికల్లో స్మృతి గెలిచినా, ఓడినా బీజేపీలో ఆమెకు ఓ గుర్తింపు రావడం ఖాయం. దాంతో స్మృతి కూడా సుష్మ స్థాయికి ఎదిగిపోతారని భావిస్తున్నారు.