న్యూఢిల్లీ : అమేథీ ప్రజల ఆశీర్వాదంతో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఓడించినా.. రాజకీయ ప్రత్యర్థిగా ఎప్పటికీ ఆమెను గౌరవిస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. అమేథీ సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్‌లో కూడా పోటీ చేయడం ఇక్కడి ప్రజలను అవమానించడమంటూ స్మృతి ఇరానీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె వ్యాఖ్యలపై స్పందించిన రణ్‌దీప్ సుర్జేవాలా గురువారం మాట్లాడుతూ.. ఆమె(స్మృతి) అమితాబ్ బచ్చన్‌ను కాపీ కొట్టాలని చూస్తున్నారు గానీ ఆఖరికి ఓ విలన్‌లా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు.
స్మృతి సిద్ధంగా ఉన్నారు..
‘స్మృతి ఇరానీ ఇలా మాట్లాడటం వెనుక ఆమెకున్న ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆఖరికి ఓ విలన్‌లా మిగిలిపోతారు. అమేథీ ప్రజల ఆశీర్వాదంతో ఆమెను ఓడించి తీరతాం. వరుసగా మూడో పరాజయానికి స్మృతి సిద్ధంగా ఉన్నారు. రాహుల్ చేతిలో ఓడిపోతే ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చి ఎంపీని చేయగలరు. కాబట్టి చింతించాల్సిందేమీ లేదు గానీ.. స్మృతి తన మొత్తం జీవిత కాలంలో పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేరనే విషయాన్ని గమనించాలి’ అంటూ రణ్‌దీప్ చురకలు అంటించారు.
కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీకి పోటీగా బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన స్మృతి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఇక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందకు ఆమె సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాహుల్ అమేథీతో పాటుగా కేరళలోని వయనాడ్‌లో కూడా పోటీ చేస్తుండటంతో స్మృతి ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తానేమో అమేథీ ప్రజల ఆశీర్వాదం కోసం వస్తే.. రాహుల్ మాత్రం తనను దీవించిన ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ స్మృతి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment