అక్కడ కయ్యం.. ఇక్కడ నెయ్యమా?: తమ్మినేని వీరభద్రం
- సీపీఐ తీరు బాగోలేదు
- మీట్ ది ప్రెస్‌లో తమ్మినేని వీరభద్రం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను ఓడించటమే లక్ష్యంగా ఏర్పడిన మూడో కూటమిలో భాగమైన సీపీఐ.. రాష్ట్రంలో అదే కాంగ్రెస్‌తో పొత్తుకు యత్నించటం ఆశ్చర్యం కలిగిస్తోందని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జాతీయ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర శాఖ వ్యవహరించటం సరికాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌కు దూరమై తమతో కలసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాఅని కచ్చితంగా ఆ పార్టీతో పొత్తుకు యత్నించాల్సిన అవసరం కూడా తమకు లేదని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. బీజేపీతో పొత్తు ఉండదని ప్రకటిస్తే టీడీపీతో, స్నేహహస్తం చాచితే టీఆర్‌ఎస్‌తో కలసి నడిచేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
- వామపక్ష పార్టీలు విడిగా ఎన్నికల బరిలో నిలవటం బాధాకరమే. అయినా విధానాలు కలవనప్పుడు కలసి నడిచే అవకాశం ఉండదు.
- దేశం వెనక బాటుకు కారణమైన కాంగ్రెస్, మతతత్వ విధానాలతో దేశానికే ప్రమాదకరంగా మారిన బీజేపీ మినహా మిగతా పార్టీలతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం
- నటులు, ప్రజాకర్షక వ్యక్తులు మోడీకి మద్దతిచ్చి పొరపాటు చేస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, ఇతర కారణాలతోనో ఆయనను బలపరిస్తే వారు భవిష్యత్తులో నేరస్తులుగా మిగిలిపోతారు.
- పవన్ కల్యాణ్‌కు వామపక్ష భావజాలాలు ఉన్నాయని అభిమానులు అనుకుంటున్నారు. కానీ ఆయన మోడీ ని బలపరచటంతో వారికి చివరకు మిగిలేది అసంతృప్తే.
- మాకు ఓట్లు, సీట్ల కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యం. ఆంధ్రప్రదేశ్‌లో బలపడేందుకు సమైక్యానికి మద్దతివ్వలేదు.. విభజనకు వ్యతిరేకంగా నిలిచినా ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణానికి పునరంకితమవుతాం.
- తెలంగాణలో 4 పార్లమెంటు, 17 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి నిర్ణయించాం. మాతో పొత్తుకు పార్టీలేవైనా వస్తే అవసరమైతే ఈ స్థానాల సంఖ్యను తగ్గించుకునేందుకు సిద్ధం. లేకుంటే మరిన్ని చోట్ల పోటీకి దిగుతాం.
- ప్రస్తుతం ఉన్న డిజైన్‌తో పోలవరం నిర్మించటం సరికాదు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తప్ప దాని వల్ల సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు.
- 2.5 లక్షల ఎకరాల ముంపు, లక్ష మంది ప్రజల తరలింపు లాంటివి లేకుండానే.. పోలవరం ఫలితాలుగా పేర్కొంటున్న 7 లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి, విశాఖ వరకు తాగునీటి కల్పన లక్ష్యాలను సాధించే ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పట్టించుకోలేదు.
- పోలవరం ముంపు పేరుతో సీమాంధ్రలో కలిపిన ఏడు మండలాలను తెలంగాణకే కేటాయించాలి. ఈ విషయంలో కేసీఆర్‌తో కలసి ఉద్యమించేందుకు సిద్ధం
- రాష్ట్ర విభజన సమయంలో పోలవరంను ‘లంచం’గా ప్రకటించారు.
- రాష్ట్రాల విభజన పేరుతో ప్రాంతాలను ముక్కచెక్కలు చేయాలనే విధానమున్న బీజేపీతో జతకట్టే యోచనలో ఉన్న టీడీపీకి తెలుగుజాతి ఐక్యత గురించి మాట్లాడే హక్కులేదు.
- వాక్చాతుర్యం ఉన్న నేతలతో రాష్ట్రం అభివృద్ధి చెందదు. మంచి విధానాలుంటేనే ప్రగ తి సాధ్యం.