ఉప ఎన్నికకు మద్దతు కూడగడుతున్న టీఆర్ఎస్
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల్లో తమదే గెలుపు అని చెబుతున్న టీఆర్ఎస్.. ఆ దిశగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు సమాయత్తమైంది. అందులోభాగంగా శుక్రవారం హైదరాబాద్లో వామపక్షాలు సీపీఐ, సీపీఎం కార్యదర్శలు చాడా వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని హరీష్ రావు వారికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై పార్టీ నాయకత్వంతో మాట్లాడి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చాడా వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ శాసనసభ, మెదక్ పార్లమెంట్ స్థానాల నుంచి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించడంతో మెదక్ పార్లమెంట్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిలను బరిలోకి దింపాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాత్రికిరాత్రే బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. అయితే బీజేపీకి టీడీపీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.