వామపక్ష పార్టీల ఐక్య పోరాటం
మంకమ్మతోట : రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సర్వశక్తులు ఒడ్డి విశాలమైన కూటమిని ఏర్పాటు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నగరంలోని వైష్ణవి గార్డెన్స్‌లో జరుగుతున్న సీపీఎం జిల్లా మహాసభలకు ఆదివారం ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు.
ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉండాలని మంచిపాలన కోసం పోరాటాలు చేస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్ పాలన ప్రజలు అనుకున్నట్లుగా ఆశాజనకంగాలేదన్నారు. కేటీఆర్ సీఎం కావాలని, టీఆర్‌ఎస్ గెలవాలని కోరుకున్న సీపీఎం ఒక్కటేనన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడునెలల్లోనే తీవ్ర వ్యతిరేక వచ్చిందని, కేసీఆర్ హామీలకు.. పొంతన లేదన్నారు.
విద్యుత్ కోతలు, బ్యాంకుల రుణాలు లేక, వడ్డీ వ్యాపారుల దోపిడీని తట్టుకోలేక ఐదు నెలల్లో 600 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలు పరిష్కరించకుండా విదేశీ పెట్టుబడుల కోసం వెంపర్లాడుతున్నారని అన్నారు. ప్రజలు సుఖంగా ఉండి, రాష్ర్టంలో విద్యుత్ కోతలు లేకుండా సస్యశ్యామలంగా ఉంటే పిలవకుండానే విదేశీ పెట్టుబడులు వస్తాయని అన్నారు.
అసెంబ్లీలో మందల కొది ఎమ్మెల్యేలు లేకపోయినా.. మనసున్న పార్టీగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతు కుంటుబాలకు రూ. 30 కోట్లు ఇవ్వని కేసీఆర్‌కు బిల్డింగ్‌లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేస్తామన్న కేసీఆర్ ఇప్పటి వరకు కేవలం 1500 ఎకరాలు మాత్రమే ఇచ్చారని, ఇలా చేస్తే 150 ఏళ్లు పడుతుందని విమర్శించారు.
భూస్వాముల నుంచి ఆక్రమించుకోలేని ప్రభుత్వం ప్రజలకు భూమి కొని ఇస్తామని చెప్పడం ప్రజలను తప్పుదోపపట్టించమేనన్నారు. పరిమితి లేకుండా భూమిని రెగ్యూలరైజ్ చేయాలని ప్రభుత్వం విడుదల చేసిన 59 జీవో ఆక్రమణ దారుల కొమ్ముకాసేలా ఉందన్నారు. కొమురంభీమ్, దొడ్డి కొమురయ్య హతమార్చిన వాడు, చాకలి ఐలమ్మ తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన నైజాం సర్కార్‌ను గొప్పవాడుగా పేర్కొనడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు.
ఉద్యమాల ఖిల్లాగా.. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న జిల్లాలో పార్టీ బలహీనపడిందని అన్నారు. కమ్యూనిజం అంటే ప్రజా సంక్షేమమేనని ప్రజా పోరాటాలతో పూర్వ వైభవం తెస్తామని చెప్పారు. మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు సాగర్, జిల్లా కార్యదర్శి జి.ముకుందరెడ్డి, మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు కొముయ్య, జిల్లా కమిటీ సభ్యులు యాకయ్య, భిక్షమయ్య, సాన అంజయ్య, జ్యోతి, భీమాసాహెబ్, ఎరవెల్లి ముత్యంరావు, భూతం సారంగపాణి, యు. శ్రీనివాస్, పంతంరవి, గుడికందుల సత్యం పాల్గొన్నారు.