యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన
రేపల్లెరూరల్, న్యూస్‌లైన్ : రూరల్ మండలంలో టీడీపీ యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తోంది. ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలు చేయాలని జిల్లా అధికారులు పదేపదే చేస్తున్న అదేశాలను మండలస్థాయి వారు విస్మరిస్తున్నారు. విద్యుత్ స్తంభాలకు పసుపు రంగులు వేయిస్తూ పార్టీ అధినేత, స్థానిక అభ్యర్థి పేర్లను రాసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. కోడ్ నీరుగారిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. మండలంలోని నల్లూరుపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహనికి నేటి వరకు ముసుగువేయకపోవటం, అదే గ్రామంలోని పలు విద్యుత్ స్తంభాలకు పచ్చ రంగు వేయడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పలువురు అంటున్నారు.
పట్టణంలోని ఓల్డుటౌన్‌లో సైతం విద్యుత్ స్తంభానికి పసుపు రంగులు వేసి అభ్యర్థుల పేర్లతో టీడీపీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోడ్ ఉల్లంఘించిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నగరం, న్యూస్‌లైన్: మండలంలోని సజ్జావారిపాలెంలో రేపల్లె-నగరం రహదారి పక్కన టీడీపీ ఫ్లెక్సీని ఏర్పాటుచేసినా అధికారులు వాటిపై కన్నెత్తి కూడా చూడకపోవటమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అన్ని పార్టీల జెండాలను తొలగిస్తున్నామని చెబుతున్న అధికారులు ఆయా పార్టీల జెండాలను తొలగించడంలేదు. నగరంలో టీడీపీ కార్యాలయానికి ఇప్పటికి కూడా ఫ్లెక్సీ ఏర్పాటుచేసి ఉంది. పెద్దవరం, తోటపల్లి, జిల్లేపల్లి గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు టీడీపీ జెండాలున్నాయి. పంచాయతీ, రెవెన్యూ అధికారులెవ్వరూ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు అంటున్నారు.