మళ్లీ గీతదాటారు!
ఎన్నికల సంఘం గీసిన లక్ష్మణరేఖను టీడీపీ నేతలు యథేచ్ఛగా దాటుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఉల్లంఘనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికల నిబంధనలన్నా వారికి పెద్దగా పట్టినట్టులేదు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీ నేతలు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఒక వైపు ప్రలోభాల ఎర వేస్తూ, మరోవైపు అరాచకత్వంతో వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై దాడులకు దిగుతున్నారు. తమ అభ్యర్థులకే ఓటు వేయాలని ఓటర్లను బెదిరిస్తున్నారు. కొన్ని చోట్ల తమ నెట్‌వర్క్‌కు చెందిన కేబుల్ ప్రసారాలను నిలిపేస్తున్నారు. ఇంకోవైపు విందులు, ఇతరత్రా తాయిలాలు అందజేస్తున్నారు. ఇటీవల ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా 300 బైక్‌లతో ర్యాలీ నిర్వహించిన టీడీపీ అభ్యర్థి మీసాల గీత మంగళవారం నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో విందు భోజనాలు పెట్టి, మందు పంపిణీ చేశారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ అభ్యర్థి మీసాల గీత గాజులరేగలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనవెంట తిరిగేందుకు ఏ ఒక్కరూ రాకపోవడంతో ప్రలోభాలకు గురి చేసి జన సమీకరణ చేశారు. తన ప్రచారం ముగిసిన తర్వాత విందుభోజనాలు ఏర్పాటు చేశారు. తాగినంత మద్యం పోసి, తిన్నంత భోజనం పెట్టారు. కోడ్ ఉల్లంఘిస్తూ ప్రభుత్వ కార్యాలయమైన వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ప్రాంగణంలో ఈ తతంగాన్ని నిర్వహించారు. స్థానిక నేతలు కర్రోతు నర్సింగరావు, ఆల్లి బంగారుబాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విధంగా ఆ పార్టీ విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి మీసాల గీత ఓటర్లను విపరీతంగా ప్రలోభ పెడుతున్నారు. ఇదొక్కటే కాదు ఆ పార్టీ తరఫున లంక వీధిలో ఉన్న ఓ మహిళా నాయకురాలు ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
వచ్చినోళ్లందరికీ రూ.20 వేలు, రూ.30 వేలు చొప్పున డబ్బు కట్టలు పంపిణీ చేస్తున్నారు. అలాగే, పట్టణ శివారు కాలనీల్లోనూ, పలు ఆస్పత్రుల్లోనూ పలుచోట్ల విందు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇంత జరిగినా అధికారులు స్పందించే తీరు ఆక్షేపణీయంగా ఉంది. జరుగుతున్న బాగోతం తెలుసుకుని విజయనగరం ఎంపీడీఓ అక్కడికెళ్లారు. ఆయన వెళ్లేసరికి తిని, తాగి వదిలేసిన ఖాళీ సంచులు కనిపించాయి. ఈ తతంగానికి అయిన ఖర్చంతా టీడీపీ అభ్యర్థి మీసాల గీత వ్యయ రిజిస్టర్‌లో జమ చేస్తామని ఎంపీడీఓ చిట్టిరాజు చెప్పుకొచ్చారు. అంతేతప్ప వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో జరిగిన బాగోతం నిబంధనలకు విరుద్ధమని గుర్తించలేదు. ఆ మేరకు కేసు నమోదు చేసే ప్రయత్నమూ చేయలేదు.