
పెచ్చరిల్లుతున్న మందు ‘బాబు’లు
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: టీడీపీ పుణ్యాన జిల్లాలో మద్యం ఏరులా పారుతోంది. ఎన్నికల వేళ గ్రామాలు మద్యం వరదలో మునిగిపోతున్నాయి. పోలింగ్ ముహూర్తం సమీపిస్తోంది. ప్రచారాలు మరికొన్ని గంటలు ముగుస్తున్నాయి. అయినా గెలుపు తలుపులు తెరుచుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించక.. టీడీపీ దిగాలు చెందుతోంది. ఓట్లు రాల్చుకోవడానికి ఏదైనా చేయాలి.. ఎన్ని అడ్డదారులైనా తొక్కాలన్న కాంక్షతో రగిలిపోతోంది. అందుకోసం తమకు తెలిసిన మద్యం.. మనీ తంత్రాన్ని ప్రయోగిస్తోంది. ఓటర్లను మత్తులో ముంచి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. లక్షలాది రూపాయల విలువైన మద్యాన్ని గ్రామాలకు తరలించి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తోంది. దాన్ని దపదఫాలుగా కార్యకర్తల ద్వారా ఓటర్లకు చేరుస్తోంది. ఈ క్రమంలో చాలామంది టీడీపీ కార్యకర్తలు పోలీసులకు దొరికపోతున్నా.. ఇక్కడా నక్కజిత్తులు ప్రయోగిస్తున్నారు. దొరికిపోయిన వారు తమ పార్టీ పేరు కాకుండా వేరే పార్టీల పేర్లు చెప్పి అధికారులనే తప్పుదోవ పట్టిస్తున్నారు. పెద్ద మొత్తంలో ఒకేసారి రవాణా చేస్తే దొరికిపోతామన్న భయంతో కార్యకర్తల ద్వారా సరుకును చిల్లరగా కూడా తరలిస్తున్నారు.
పంచాయతీకి 20 కేసుల కోటా
మద్యం, నగదు పంపిణీతో ఓట్లు దండుకోవాలని చూస్తున్న టీడీపీ అభ్యర్థులు ఈ విషయంలో గ్రామాలకు కోటా నిర్ణయించి సరఫరా చేస్తున్నారు. అగ్ర నేతల సారధ్యంలో జిల్లా కేంద్రంతో పాటు ఎచ్చెర్ల, టెక్కలి, పలాస, ఆమదాలవలస, పాలకొండ, ఇఛ్చాపురం తదితర నియోజకవర్గాల్లో వివిధ రూపాల్లో మద్యం సరఫరా చేస్తున్నారు. నరసన్నపేట ప్రాంతంలో దీనికి టోకెన్ విధానం పెట్టగా.. కొన్ని చోట్ల నిల్వ స్థావరాలను నిర్వహిస్తున్న కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ఎవరికి మద్యం సరఫరా చేయాలో అగ్రనేతలే ఫోన్లలో సూచనలు చేస్తున్నారు. పంచాయితీకి 20 నుంచి 30 కేసుల మద్యం సరఫరా చేస్తున్నారు. ఇంకా అవసరమైతే అందజేసేందుకు వీలుగా ఒడిశా మద్యాన్ని కూడా తెప్పించి సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది. మద్యం సరఫరా పర్యవేక్షణకు ఎచ్చెర్ల లాంటి చోట్ల 5 పంచాయతీలకు ఒకటి చొప్పున ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. టెక్కలి నియోజకవర్గంలో స్వయంగా టీడీపీ అభ్యర్థే ఈ తంతును పర్యవేక్షిస్తున్నారు.
ఇటీవల కాలంలో పట్టుబడిన టీడీపీ తమ్ముళ్లు
మార్చి 31న జలుమూరు మండలం లిం గాలవలసలో ఓ టీడీపీ కార్యకర్త వద్ద 117 మద్యంసీసాలను పోలీసులు పట్టుకున్నారు.
ఏప్రిల్ 3న లావేరు మండలం కేశవరాయునిపాలెంలో టీడీపీ నేతకు చెందిన ఆటోలో 224 మద్యం సీసాలు, అక్కడే జరిపిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద 68 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏప్రిల్ 4న సంతకవిటి మండలం కాకరాపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తల నుంచి 450 మద్యం సీసాలు, సీతంపేట మండలం దేవనాపురంలో టీడీపీ కార్యకర్త నుంచి 17 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఏప్రిల్ 6న కోటబొమ్మాళి మండలం కొత్తపేట వద్ద 110 మద్యం సీసాలతో ఓ టీడీపీ కార్యకర్త పట్టుబడ్డాడు.
ఏప్రిల్ 8న నందిగాం మండలం పెద్ద తామరాపల్లిలో 70 మద్యం సీసాలతో టీడీపీ కార్యకర్తను పట్టుకున్నారు.
ఏప్రిల్ 13న గార, ఎచ్చెర్ల మండలాలకు చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల నుంచి 40 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఏప్రిల్ 21న పాలకొండ మండలంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల నుంచి 30 బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏప్రిల్ 24న ఎచ్చెర్ల మండలంలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు 170 మద్యం సీసాలతో పోలీసులకు దొరికిపోయారు.
మే 3న పొందూరు సమీపంలో రెడ్డిపేట వద్ద స్థానిక టీడీపీ నేతకు చెందినవిగా భావిస్తున్న సుమారు 10వేల మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అదే రోజు మందస మండలం హరిపురంలో 452 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.