చట్టసభలకు ఏడు కొత్తముఖాలు
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి విజయం సాధించిన వారిలో ఏడుగురు తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టనున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఇద్దరు కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా.. టీడీపీ నుంచి ఒక ఎంపీతో సహా ఐదుగురు కొత్తవారే కావడం విశేషం. శుక్రవారం వెల్లడైన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికైన కింజరాపు రామ్మోహన్‌నాయుడు చిన్న వయసులోనే పార్లమెంటులోకి అడుగుపెడుతున్నారు. ఇక వైఎస్‌ఆర్‌సీపీ తరఫున పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా ఎన్నికైన విశ్వాస రాయి కళావతి, కలమట వెంకటరమణలు అసెంబ్లీకి కొత్తవారే. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వీరు జిల్లా తరఫున తమ వాణి వినిపించనున్నారు.
అలాగే శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఆమదాలవలసల నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన గుండ లక్ష్మీదేవి, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, కూన రవికుమార్‌లు మొదటిసారి చట్టసభల్లో ప్రవేశిస్తున్నారు. లక్ష్మీదేవి, రమణమూర్తి, అశోక్‌లు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. కూన రవికుమార్ 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆమదాలవలస నుంచే పోటీ చేసి ఓడిపోగా.. పాతపట్నం, పాలకొండల్లో గెలుపొందిన కలమట వెంకటరమణ, కళావతిలు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలో దిగి ఓడిపోయారు. ఇప్పుడు రెండో ప్రయత్నంలో విజయాన్ని అందుకున్నారు.