ఓటేస్తే వేటే!
బెదిరింపులు
‘పోలింగ్ రోజు మీరు, మీ కుటుంబ సభ్యులు బయటకు రావద్దు. ఎంత కావాలంటే అంత తీసుకోండి. సరదాగా ఎక్కడికైనా వెళ్లి రండి. అంతేగానీ ఓట్లేయడానికి మాత్రం రావద్దు. లేకపోతే తరువాత జరిగే దానికి మేం బాధ్యులం కాదు. జాగ్రత్త’
-రెండు రోజుల క్రితం టెక్కలిలో ఎస్సీ వర్గానికి చెందిన కొందరు యువకులకు టీడీపీ నేతల హుకుం. వారిని ప్రత్యేకంగా ఒక చోటుకుపిలిపించి మరీ జారీ చేసిన హెచ్చరిక.
‘మీరు ఎలాగూ మాకు ఓట్లేయరు. వేస్తామని ఇప్పుడు చెప్పినా పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన తర్వాత మీరేం చేస్తారో మాకు తెలుసు. అందుకే అసలు మీరు ఓటింగ్‌కే రావద్దు. ఓట్లేయాలనుకంటే అంతకు అంత అనుభవిస్తారు.. జాగ్రత్త! మీ వాళ్లెవరూ ఓటింగ్‌కు రావడానికి వీల్లేదు’
-పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం, పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు
మండలానికి చెందిన గిరిజనులను పిలిపించి మరీ టీడీపీ నేతలు ఇచ్చి న వార్నింగ్ .
‘పోలింగ్ రోజు వేటకు వెళ్లిపోండి. అంతేగానీ ఊళ్లలో ఉండొద్దు. ఓటేయడానికి వెళ్లొద్దని మీ ఆడోళ్లకు, ముసలోళ్లకు కూడా చెప్పండి’
- ఇచ్ఛాపురం రూరల్ మండలంలోని మత్స్యకారులకు అక్కడి టీడీపీ నేతల హెచ్చరిక .
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇలా అక్కడా ఇక్కడా అని కాదు.. జిల్లావ్యాప్తంగా కొద్ది రోజులుగా టీడీపీ బెదిరింపుల పర్వం యథేచ్ఛగా సాగిపోతోంది. ఓటమి భయం పట్టుకున్న ఆ పార్టీ నేతలు బెదిరింపుల పర్వానికి తెర తీశారు. ప్రజలు ఎలాగూ ఓట్లేయరని నిర్ధారించుకున్న టీడీపీ పెద్దలు ఏకంగా ఓటింగ్‌ను అడ్డుకునేందుకు తెగిస్తున్నారు. ఎంపిక చేసుకున్న వర్గాలే లక్ష్యంగా బెదిరింపులకు బరి తెగించారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తున్నారు. పోలింగ్‌కు వారం రోజుల ముందే టీడీపీ తన అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. ప్రధానంగా కింజరాపు కుటుంబం తెరవెనుక సూత్రధారిగా ఉండగా... ఆ కుటుంబానికి అండగా ఉన్న ద్వితీయశ్రేణి నేతలు ఈ దౌర్జన్య కాండలో పాత్రధారులుగా ఉండటం పరిస్థితిని ఆందోళన కలిగిస్తోంది.
నిమ్న వర్గాలే టార్గెట్!
బెదిరింపుల పర్వం వెనుక అసలు ఉద్దేశం పోలింగ్ శాతం తగ్గించడమే. అందుకోసం టీడీపీ పెద్దలు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. కనీసం 15 శాతం ఓటింగ్‌కు గండి కొట్టాలన్నది వారి వ్యూహం. అందుకోసం కచ్చితంగా తమకు ఓటేయరనుకున్న వర్గాలను గుర్తించారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార వర్గాలనే టార్గెట్ చేశారు. ఆ వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు ఒకటి రెండుసార్లు ప్రయత్నించారు. కానీ వారంతా వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నారని తేలింది. దాంతో ఇక లాభం లేదని టీడీపీ పెద్దలే రంగంలోకి దిగారు. ఒకేసారి నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న వారిని బెదిరిస్తే బటయపడిపోతుందని భావించి చాపకింద నీరులా వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. నియోజకవర్గాలవారీగా చిన్న చిన్న బృందాలను ఏర్పాటు చేశారు. వాటికి టీడీపీ అభ్యర్థుల కుటుంబ సభ్యులనే ఇన్‌చార్జీలుగా నియమించారు.
ఈ బృందాలు ఒక్కొక్కటిగా రంగంలోకి దిగాయి. ఎంపిక చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారవర్గాలకు చెందిన యువకులను రహస్య ప్రదేశాలకు పిలిపిస్తున్నాయి. ఓటింగ్‌కు రావద్దని కచ్చితంగా చెబుతున్నాయి. తమ మాట వినకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. మాట విని పోలింగ్‌కు దూరంగా ఉంటే అంతా బాగుం టుంది. లేదు మా ఓటు మా ఇష్టం.. వేస్తామంటే.. ఎన్నికల తర్వాత మీ సంగతి తేలుస్తాం. ఊళ్లో ఉండకుండా చేస్తాం’ అని తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నాయి. ఆ వర్గాలకు చెందినవారు ఏమైనా గట్టిగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే వారిపై అక్కడే దౌర్జన్యానికి కూడా దిగుతున్నాయి. దాంతో బెదిరిపోతున్న ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు తాము టీడీపీకే ఓటేస్తామని చెప్పి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. కానీ టీడీపీ పెద్దలు అందుకు కూడా ససేమిరా అంటున్నారు. ‘మీరు మాకు ఓట్లేయరని తెలుసు. ఇవన్నీ అనసవరం. మీరు అసలు ఓటింగ్‌కే రావద్దు.. అంతే. మాట వినకుంటే మీ అంతు చూస్తాం’అని తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారు. ఇలా తమను పిలి పించి మరీ బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఆయా వర్గాలకు చెందినవారు భీతిల్లుతున్నారు.
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో టీడీపీ పెద్దలు బెదిరింపులకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నా జిల్లా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ల దృష్టి కి వచ్చిన ఉదంతాలపై కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. సాంకేతిక అంశాల ను సాకుగా చూపించి మౌనంగా ఉండిపోతున్నారు. అంటే.. ఎక్కడైనా బహిరంగంగా ఘర్షణలు జరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగితే తప్ప పట్టించుకోమనే రీతిలో వ్యవహరిస్తున్నారు. అంతేగానీ ముం దుగా ఓటర్లకు భరోసా ఇచ్చి అందరూ ధైర్యంగా ప్రశాంతంగా ఓటింగ్‌లో పాల్గొనేలా చేయాలన్న ఉద్దే శం అధికారులకు లేకపోవడం ఆందోళనకలిగిస్తోంది.