తమ్ముళ్ల యూ టర్న్! | tdp leaders u turns | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల యూ టర్న్!

Published Fri, Apr 11 2014 3:13 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

tdp leaders  u turns

మలుపు తిరుగుతున్న రాజకీయం
 బీజేపీతో పొత్తుపై టీడీపీ నేతల అసంతృప్తి
 జేసీ మార్క్ రాజకీయంపై ఆగ్రహం
 వైఎస్‌ఆర్‌సీపీ వైపు అన్ని వర్గాల చూపు
 త్వరలో వైఎస్‌ఆర్‌సీపీలోకి భారీగా చేరికలు!
 తుది విడత ప్రాదేశిక పోరుపై తీవ్ర ప్రభావం
 మెజార్టీ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల హవా!

 
 
 సాక్షి, అనంతపురం :  ‘అనంత’ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు.. టికెట్ల కేటాయింపులో అసంతృప్తి.. జేసీ మార్క్ రాజకీయంతో తెలుగుదేశం పార్టీ నేతలు అంతర్గతంగా రగిలిపోతున్నారు. ఈ క్రమంలో చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి ప్రజాదరణ ఉండడంతో టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.


 ఈ ప్రభావం శుక్రవారం జరిగే తుది విడత ప్రాదేశిక ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకి ఎక్కడా ఓటు బ్యాంక్ లేదని, ఆ పార్టీకి చెందిన ఓట్లు, మోడీ ప్రభంజనంతో పడే ఓట్లు తనకొద్దంటూ కొన్ని రోజులుగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా అనంతపురం అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయించాలనుకున్నా చివరి నిమిషంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అనంతపురం బదులు గుంతకల్లు స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించే విషయమై ఇరు పార్టీల్లో ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.


 ఈ క్రమంలో జేసీ వర్గంగా ముద్రపడిన గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాకు ఏదో ఒక విధంగా న్యాయం చేకూర్చేలా జేసీ మార్క్ రాజకీయం నడుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మధుసూదన్‌గుప్తాను బీజేపీలోకి పంపి గుంతకల్లు స్థానాన్ని  ఆయనకే కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే గుంతకల్లు అసెంబ్లీ టికెట్‌ను దివంగత మాజీ ఎమ్మెల్యే సాయినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. ఆ కుటుంబంలోని వారికే టికెట్ వస్తుందన్న ప్రచారం కూడా సాగింది. చివరకు ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని తెలియడంతో సాయినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఇక రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చాలా కాలంగా కృషి చేస్తున్న దీపక్‌రెడ్డిని కాదని.. ఆ స్థానాన్ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులుకు కేటాయించడంతో టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాలవకు సహకరించలేమని దీపక్‌రెడ్డి వర్గీయులు తెగేసి చెబుతున్నారు. ఇలా కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆ పార్టీ నేతలు యూటర్న్ తీసుకోవాలని భావిస్తున్నారు.


వైఎస్‌ఆర్‌సీపీలో చేరితే సముచిత స్థానం దక్కుతుందన్న భావనతో చాలా మంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీలో కొనసాగుతున్న వారితో రాయబారాలు సాగిస్తున్నట్లు సమాచారం. వీరంతా సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ్ముళ్ల యూ టర్న్ ప్రభావం శుక్రవారం జరిగే ప్రాదేశిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుంది. 32 జెడ్పీటీసీ, 400 ఎంపీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో అధిక శాతం స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు కైవసం చేసుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement