మెగా ఫిక్సింగ్! | tdp,samaikyandhra party leaders are combined for win in elections | Sakshi
Sakshi News home page

మెగా ఫిక్సింగ్!

Published Mon, May 5 2014 11:45 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

మెగా ఫిక్సింగ్! - Sakshi

మెగా ఫిక్సింగ్!

సాక్షి ప్రతినిధి, గుంటూరు : జమిలి ఎన్నికల చివరి అంకంలో టీడీపీ బరితెగించింది. గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోంది. పోటీ చేస్తున్న ఇతర పార్టీల అభ్యర్థులకు కోట్లు కుమ్మరించి బరిలో లేకుండా చేస్తోంది. వారి ద్వారా ఒక్క ఓటు వచ్చినా చాలన్నట్టుగా వ్యవహరిస్తోంది. గట్టిగా  వంద మంది ఓటర్లను ప్రభావితం చేయలేని అభ్యర్థులను కూడా పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీ డీపీలో చేర్చుకుంటోంది.
 
ప్రచారం చేసే సమైక్యాంధ్ర పార్టీకి చెందిన నలుగురు అసెంబ్లీ అభ్యర్థుల్ని టీడీపీ గంపగుత్తగా కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. వారంతా సోమవారం బరిలో నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. గురజాల, మాచర్ల, ప్రత్తిపాడు, పెదకూరపాడు నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా టీ డీపీతో కుమ్మక్కయ్యారు. ఈ నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థికి రూ.50 లక్షలు చెల్లించినట్లు సమాచారం.
 
నల్లారితో ఒప్పందం మేరకేనని ప్రచారం...
జిల్లాలో తెలుగుదేశం పార్టీతో జై సమైక్యాంధ్ర పార్టీ కుమ్మక్కు రాజకీయాలు నడుపుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిల మధ్య కుదిరిన ఒప్పందం మేరకే జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకొని టీడీపీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. మాచర్ల నుంచి పోటీ చేస్తున్న పులుసు సత్యారెడ్డి, గురజాల అభ్యర్థి కోలా అప్పిరెడ్డి, వినుకొండ అభ్యర్థి రమేష్, చిలకలూరిపేట అభ్యర్థి ఆంజనేయులు తాము పోటీ నుంచి తప్పుకొని టీడీపీలో చేరుతున్నట్లు సోమవారం ప్రకటించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌పార్టీ సీమాంధ్రులకు తీరని అన్యాయం చేసిందని ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు జై సమైక్యాంధ్రపార్టీ స్థాపించినట్లు ప్రకటించిన కిరణ్‌కుమార్‌రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కు కావడంపై ప్రజలు తీవ్ర అసహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో జేఎస్పీ అభ్యర్థులకు ప్రజలను ఏ మాత్రం ప్రభావితం చేసేశక్తి లేదు. అయినా ఒకటి, రెండు ఓట్ల కోసం టీడీపీ ఇంతకు దిగజారుడు రాజకీయాలు చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 కాంగ్రెస్ అభ్యర్థుల సహకారం...

 ఎన్నికల బరి నుంచి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను తప్పించేందుకు ఎంతకైనా తెగిస్తున్న టీడీపీ అప్రజాస్వామ్యక రాజకీయాలకు తెరలేపింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎదుర్కొన లేక చీకటి రాజకీయాలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు పావులు కదిపింది. ఇందుకోసం పెద్ద ఎత్తున డబ్బు వెదజల్లింది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపు ఖాయమనుకున్న నియోజకవర్గాల్లో ఈ తరహా రాజకీయాలు చేస్తోంది. ఇప్పటికే మాచర్ల, తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, సత్తెనపల్లి, గురజాల, పెదకూరపాడు, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు టీడీపీకి సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 జిల్లాలో కార్పొరేట్ రాజకీయాలు...
 జిల్లాలో రాజకీయాలు పూర్తిగా వ్యాపార పరంగా మారిపోయాయి. కార్పొరేట్ తరహా రాజకీయాలు జిల్లాలో ప్రవేశించాయి. ఓటుకు నోటుతో పాటు ప్రత్యర్థుల శక్తి సామర్ధ్యాలను బట్టి రేటును నిర్ణయిస్తున్నాయి. ఇందులో భాగంగా పార్టీల అభ్యర్థులను కొనుగోలు చేయడం, వంటివి చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఇంతటి కుమ్మక్కు, అప్రజాస్వామిక రాజకీయాలకు పాల్పడటంపై ప్రజలు ఆశ్చర్యాన్ని, అసహ్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement