కంటితుడుపు ప్రాతినిధ్యం | telangana Special Committees set up chandra babu | Sakshi
Sakshi News home page

కంటితుడుపు ప్రాతినిధ్యం

Published Wed, Mar 26 2014 3:03 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

telangana Special Committees set up chandra babu

 సాక్షి, మంచిర్యాల : ‘గాలికి పోయే పిండి కృష్ణార్పణం’.. అన్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా తెలంగాణకు ఏర్పాటు చేసిన కమిటీ మొక్కుబడేనని ఆ పార్టీ నాయకులు పెదవి విరుస్తున్నారు. ఆ కమిటీలో జిల్లాకు దక్కిన ప్రాధాన్యం వీరి మాటలకు అద్దంపడుతోంది. తమ అధినేతకు తెలంగాణపై ఉన్న ప్రేమ దీంతో స్పష్టమైందని విమర్శిస్తున్నారు. తెలంగాణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నామంటూ సుదీర్ఘ కాలం ఊరించిన చంద్రబాబు సోమవారం కమిటీలను ప్రకటించారు.

తెలంగాణ ఎన్నికల కమిటీ, ఎన్నికల మేనిఫెస్టో కమిటీ అని రెండు కమిటీలను ప్రకటించి ప్రచార కమిటీ ఊసెత్తలేదు. అయితే ఈ రెండు కమిటీల్లోనూ జిల్లా నుంచి ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్ ఒక్కరికే చోటు కల్పించారు. ఎన్నికల కమిటీలో రంగారెడ్డి, వరంగల్ జిల్లాల నేతలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు ఆదిలాబాద్‌పై ఎందుకు చిన్నచూపు చూశారని ప్రశ్నిస్తున్నారు. కమిటీలో రంగారెడ్డి నుంచి ముగ్గురు నేతలు, వరంగల్ నుంచి ఇద్దరు నాయకులకు చోటిచ్చారు. కీ లకమైన తెలంగాణ మేనిఫెస్టో కమిటీలో జిల్లాకు చెందిన నాయకుడు ఒక్కరు కూడా లేకపోవడం తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి ఆజ్యం పోస్తోంది. ఆ కమిటీ లోనూ వరంగల్ నాయకులిద్దరికీ అవకాశం ఇచ్చి జిల్లాకు మొండిచేయి చూపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


 దేనికీ సంకేతం..?

 జిల్లాలో పది నియోజకవర్గాలు, ఆయా స్థానాల బాధ్యులు వీరేకాకుండా ఇద్దరు జిల్లా అధ్యక్షులు, సీనియర్ నేతలు ఉన్నా మొక్కుబడిగా ఒక్కరికే చోటివ్వడం ఏంటని టీడీపీ నాయకు లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర ప్రజల్లో బలంగా నాటుకుంటే ఈ కమిటీ కూర్పు ను ప్రజలకు ఏమని వివరిస్తామని వాపోతున్నారు. పార్టీ, అధినేత వైఖరి కారణంగా కలిగిన నష్టం చాలదన్నట్లు మరో రచ్చ ను తెచ్చిపెట్టారని మండిపడుతున్నారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పార్టీ తరఫున నిలబడేందుకు అభ్యర్థులు కరువై అవమానాలు పడ్తుంటే ఇదెక్కడి సమస్యని వ్యాఖ్యానిస్తున్నారు. నామమాత్రపు కమిటీల్లోనే తమకు ప్రాధాన్యం దక్కనప్పుడు తెలంగాణ  వికాసంలో తమ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని పార్టీ సీనియర్ నాయకుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలతో పార్టీ పరువు దెబ్బతినడమే కాకుం డా వ్యక్తిగతంగానూ నష్టం చేయడం ఖాయమని వాపోతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement