శ్రీకాకుళం, న్యూస్‌లైన్: వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మోడీ పాలనతోనే సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు యూవీ కృష్ణంరాజు అన్నారు. బీజేపీ ప్రచార యాత్ర సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో బుధవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న ప్రజలు తమను ఆదుకునేవారి కోసం ఎదురుచూస్తున్నారన్నారు.పదేళ్ల కిందట దేశం ఇదే పరిస్థితిలో ఉంటే వాజ్‌పాయి వచ్చి ఆదుకున్నారని, ప్రస్తుతం మోడీ రానున్నారని చెప్పారు. మోడీ నాయకత్వంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ రాష్ట్రాన్ని చూస్తే తెలుస్తుందన్నారు.
నా మొర పట్టించుకోలేదు
తాను యూపీఏలో మంత్రిగా ఉన్నా రాష్ట్ర విభజనకు సంబంధించి తన మాట చెల్లుబాటు కాలేదని బీజేపీ ప్రచార సారథి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విభజన సందర్భంగా యూపీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు.
టీవీ ప్రసారాలను నిలిపివేయించి తలుపులు మూసేసి దారుణంగా ప్రవర్తించారన్నారు. తన మాటకు యూపీఏ ప్రభుత్వం ప్రాధాన్యమివ్వకపోవడంతో ప్రతిపక్ష నేత వెంకయ్యనాయుడిని కలిసి సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూడాలని కోరినట్లు తెలిపారు. హితం చేసేవారికే ఓటు వేయాలని, పొత్తుల విషయాన్ని బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ప్రజలు విజ్ఞులని, తొలి నుంచి కాంగ్రెసేతరులను ఎన్నుకున్నారన్నారు. ఈ సారికూడా బీజేపీకి ప్రాతినిధ్యం కల్పిస్తే రాష్ట్రానికి అవసరమైన వాటిని తెచ్చుకోగలుగుతామన్నారు.
సమావేశంలో బీజెపీ నాయకులు చలపతిరావు, చిలకం రామచంద్రరావు, ఎస్. సురేష్‌రెడ్డి, పైడి వేణుగోపాలరావు, విష్ణువర్థనరెడ్డి, మాలతీరాణి, భానుప్రకాష్‌రెడ్డి, వి. బాలకృష్ణ, మాధవ్, వరలక్ష్మి, శవ్వాన ఉమామహేశ్వరి, రామతీర్ధ, మంద మోహన్, సూరు చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు.
మోడీ పాలనతోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి
Published Thu, Mar 27 2014 2:10 AM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM
Advertisement
Advertisement