
ఇదే నా చివరి పోటీ
షోలాపూర్, న్యూస్‌లైన్: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే చివరిసారి అని, ఇకపై తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల్లో వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను తొలిసారి ఎన్నికల్లో పోటీచేసినప్పుడు రూ. 25 వేలు మాత్రమే ఖర్చు కాగా, అదిప్పుడు ఎన్నోరెట్లు పెరిగిపోయిందన్నారు.
ఎన్నికల్లో వ్యయం పెరిగిపోవడం వల్ల సామాన్యులు పోటీ చేసి గెలిచే అవకాశం లేకుండా పోయిందన్నారు. షిండే షోలాపూర్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఆయన పట్టణంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, తనకు హైటెక్ ప్రచారం అవసరం లేదని, షోలాపూర్ అభివృద్ధి కోసం తాను ఎన్నో పనులు చేశానని, వాటిని కార్యకర్తలు ప్రజల వద్దకు చేరవేస్తారని చెప్పారు.