బెదిరింపులు...బ్లాక్‌మెయిలింగ్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. డబ్బులు, బెదిరింపు లు, కార్పొరేట్ ఎత్తుగడలతో ఆ పార్టీ నేతలు విలవిల్లాడిపోతున్నారు. చీపురుపల్లి టిక్కెట్ కేటాయింపు విషయంలో కళా వెంకటరావు....అశోక్‌ను బెదిరించి తన దారికి తెచ్చుకున్నారు. ఇదే విషయమై ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గం తారస్థాయిలో చర్చ జరుగుతోంది.
విజయనగరం పార్లమెంట్ పరిధిలోకి రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, చీపురుపల్లి టిక్కెట్ తమకిస్తేనే ఆ రెండు నియోజకవర్గాల ఓట్లు పడతాయని, లేదంటే తమ అనుచరులు కష్టపడి పనిచేయరని కిమిడి కళా వెంకటరావు పరోక్షంగా అటు అధిష్టానాన్ని, ఇటు అశోక్‌గజపతిరాజును బెదిరించారన్న వాదన విన్పిస్తోంది. దీంతో తప్పని పరిస్థితిలో దిగొచ్చినట్టు తెలిసింది.
అయితే, ఈ వ్యూహం వెనుక పార్టీ కార్పొరేట్ పెద్దల పాత్ర ఉందని తెలుస్తోంది. అశోక్ గజపతిరాజును దారికి తెచ్చుకోవాలంటే ఇదొక్కటే తారకమంత్రమని కిమిడికి అండగా నిలిచిన కార్పొరేట్ పెద్దలు సూచించడంతోనే ఈ రకమైన ఎత్తుగడకు దిగినట్టు పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. కిమిడి పెట్టిన మెలికతో ఆయా నియోజకవర్గాల ఓట్లు ఎక్కడ పడవోనన్న భయంతో అశోక్ తలొగ్గారన్న వాదనలు విన్పించాయి.
తనను నమ్ముకుని పనిచేస్తున్న త్రిమూర్తులురాజును ఎలాగైనా ఒప్పించవచ్చని, కిమిడికి ఉన్న బంధుత్వంతో కెంబూరి రామ్మోహనరావుతో దారికి తెచ్చుకోవచ్చన్న ఉద్దేశంతో మృణాళిని అభ్యర్థిత్వానికి అశోక్ అంగీకరించారనే చర్చ జరుగుతోంది. డామిట్ కథ అడ్డం తిరిగినట్టు త్రిమూర్తులరాజు, రామ్మోహనరావు రెబెల్స్‌గా నామినేషన్ వేసి దడ పుట్టించారు. ఎవరెన్ని చెప్పినా బరిలో ఉంటామని మొండికేస్తున్నారు.
బుజ్జగించే పనిలో జిల్లా నాయకత్వం..
రెబల్స్‌గా ఉన్న త్రిమూర్తులురాజు, కెంబూరి రామ్మోహనరావులను బుజ్జగించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. కానీ, వారిద్దరూ ఫోన్‌లోకి అందుబాటులోకి రాలేదు. దీంతో ఆ బాధ్యతలను జిల్లా నాయకత్వానికి అప్పగించారు.
ఇప్పుడా పార్టీ కీలక నేతలు రెబల్స్‌ను ఒప్పించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఒక పర్యాయం మాట్లాడారు. కానీ దారికి రాలేదు. దీంతో ఆదివారం రాత్రి అశోక్ గజపతిరాజు, ద్వారపురెడ్డి జగదీష్ నేరుగా రంగంలోకి దిగారు. చీపురుపల్లి వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ, రెబెల్స్ ఇద్దరు తలొగ్గే పరిస్థితి కనిపించడం లేదు.
దారికి రాని నిమ్మక..
కురుపాం టీడీపీ రెబెల్‌గా నామినేషన్ వేసిన నిమ్మక జయరాజ్ కూడా పార్టీ నేతల బుజ్జగింపులకు తలొగ్గలేదు. దారికొచ్చేది లేదని, నామినేషన్ ఉపసంహరించుకోనని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని, టీడీపీ కార్యకర్తలంతా తనవైపే ఉన్నారని జిల్లా నాయకత్వానికి గట్టిగా బదులిచ్చినట్టు తెలిసింది. దీంతో ఆ పార్టీ నాయకులు కంగుతిన్నారు. జయరాజ్‌ను దారికి తీసుకురాలేమన్న నిర్ణయానికొచ్చేశారు.